● ప్రపంచ బ్రెయిన్ డే–2026 సందర్భంగా ‘మెదడు ఆరోగ్యం–అందరికీ అందుబాటులో అనే అంశంపై న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్, గుంటూరు ఆధ్వర్యంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ప్రజా చర్చా కార్యక్రమం నిర్వహించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు పాల్గొని మెదడు ఆరోగ్యం, నాడీ సంబంధిత వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
● డాక్టర్ విజయ మాట్లాడుతూ పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సులోనైనా మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర ఆహారం, ఒత్తిడి వంటి ప్రధాన ప్రమాద కారకాల వల్ల మెదడు సంబంధిత వ్యాధులు సంభవిస్తాయని వివరించారు.
● సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రామతారకనాథ్ మాట్లాడుతూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం, మానసికంగా చురుకుగా ఉండడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
● సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమారవేలు మాట్లాడుతూ తగినంత నిద్ర మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, గురకను నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
● న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ బ్రెయిన్‌డే ప్రాముఖ్యతను వివరించారు.
● డాక్టర్ నవీన్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యంపైనా సమాన శ్రద్ధ చూపాలని, నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
● న్యూరాలజిస్ట్ డాక్టర్ మీనా మాట్లాడుతూ మెదడు వ్యాధులకు సంబంధించిన అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
● న్యూరోసర్జన్ డాక్టర్ హేమంత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
గుంటూరు మెడికల్: ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ – గుంటూరు ఆధ్వర్యంలో ప్రజా చర్చా వేదిక గురువారం నిర్వహించారు. న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమన్నారు. ఇటీవల డాక్టర్ విజయ ప్రపంచ స్ట్రోక్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికై న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు నాయకులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
సభను గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకులు ఎల్.ఎస్. భారవి, జి. శ్రీనివాసరావు, మల్లికార్జున్, మురళి సమన్వయంతో నిర్వహించారు.
న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ