తాడికొండ: తాడికొండలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులను అర్ధంతరంగా పంపించి వేస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. పాఠశాలలో 5, 6, 7, 8 విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలంటూ ఉపాధ్యాయులు ఫోన్‌లు చేస్తున్న నేపథ్యంలో వారంతా పాఠశాలకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. వారికి మద్దతుగా వనమా బాల వజ్రబాబు వచ్చి బాధిత తల్లిదండ్రులతో మాట్లాడారు. గతంలో తనకు వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో స్పందించి ప్రిన్సిపల్ వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఇక్కడ ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, నీట్, జేఈఈ శిక్షణ సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఇలా తరలిస్తే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. 437 మంది విద్యార్థులున్నా తల్లిదండ్రుల సమావేశం కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఎందుకు నిర్వహించలేదన్నారు. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇస్తే నేడు గురుకుల సెంటర్‌నే ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు. ఇది నారాయణ కలను సాకారం చేసేందుకే అన్నారు. వెంట పార్టీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు దాసరి రాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సీహెచ్ వినోద్, నియోజకవర్గ అధ్యక్షుడు సంపతి నాగరాజు, మండల అధ్యక్షుడు మల్లంపాటి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ విభాగాల నాయకులు బోళ్ళ లోకేష్ రెడ్డి, దానం వినోద్, గుంటి రఘువరన్, బాకి వెంకట స్వామి, చావల రంజిత్, షేక్ అజీస్, షేక్ జర్జీష్, ఉయ్యూరు వెంకటరెడ్డి, కూచిపూడి సాయికిరణ్ ఉన్నారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు


