ఒక్క గుంటూరు పశ్చిమలోనే దాదాపు 22 వేల డబుల్ ఓట్లు అందుబాటులో లేని వారే ఎక్కువ మంది విదేశాల్లో ఉండేవారు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని వారూ అధికం వెనక్కి రాని ఎన్యూమరేషన్ ఫారాలు
సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడింది. రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువ మంది రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగి ఉండటం కూడా గమనార్హం. విదేశాల్లో ఉండేవారు, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో చదువులు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన వారు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఓటు ఉండి, ఇక్కడ నివాసం ఉండేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎవరు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనేది తేల్చుకోలేకపోవడంతో ఈ నియోజకవర్గంలో డిజిటైజేషన్ నత్తనడకన నడుస్తోంది. సర్ కారణంగా ఇక్కడ సుమారు 25 వేలకుపైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 291 పోలింగ్ కేంద్రాలలో 2,78,555 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,77,003 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇంకా 1,552 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కేవలం 1,60,009 మంది ఫారాలను డిజిటైజ్ చేశారు. 290 ఫారాలను ఇంకా బీఎల్‌ఓలు తనిఖీ చేయాల్సి ఉంది. దాదాపు 22 వేల మందికి పైగా రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమారు మూడు వేల మందికి మూడు చోట్ల ఓట్లు ఉన్నట్లుగా తేలింది. గుంటూరు పశ్చిమతోపాటు తాడికొండ, ప్రత్తిపాడు, వినుకొండ, సత్తెనపల్లి వంటి ప్రాంతాలు, తెలంగాణలో కూడా వీరికి ఓట్లు ఉన్నాయి. వారు ఎక్కడ ఓటు ఉంచుకోవాలనే దానిపై సందిగ్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకూ ఎన్యూమరేషన్ ఫారాలను వెనక్కి ఇవ్వలేదని సమాచారం.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు
గుంటూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి డిజిటలైజ్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మీపురం, శ్యామలానగర్, పట్టాభిపురం, బృందావన్ గార్డెన్స్, విద్యానగర్, ఎస్‌వీఎన్ కాలనీలలో ఇళ్లు అక్కడక్కడ ఉండటం, అడ్రస్ ట్రేస్ కాకపోవడం వంటి ఇబ్బందులతో ఎన్యూమరేషన్ ఫారాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. ఒక్కో స్పెషల్ ఆఫీసర్ పరిధిలో రోజుకు ఎనిమిది వందల ఫారాలను వెనక్కి తీసుకురావాలని, ప్రతి బీఎల్‌ఓ వందకు తగ్గకుండా డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. మూడు వందల ఫారాలు కూడా వెనక్కి రావడం లేదు.
దీనిపై గురువారం జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా మున్సిపల్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా గడువు ఐదు రోజులే ఉన్నా 1.17 లక్షలకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రావాల్సి ఉంది. వచ్చిన వాటిలో కూడా మరణించిన ఓటర్లు 5,646 మంది ఉండగా.. 1,766 మంది వరకూ శాశ్వతంగా ఇక్కడి నుంచి చిరునామా మార్చుకున్న వారే. ఇప్పటికే వేరేచోట ఎన్‌రోల్ అయినవారు 2,482 మంది ఉన్నారు. 9,882 ఎన్యూమరేష్ ఫారాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. వీరందరికి ఓటు హక్కు పోయినట్లే. పశ్చిమ నియోజకవర్గంలో డిజిటైజేషన్ కేవలం 57 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. జిల్లాలో తాడికొండ 85.24 శాతంతో అగ్రభాగాన ఉంది. తర్వాత స్థానాల్లో 79.99 శాతంతో పొన్నూరు, 78.36 శాతంతో తెనాలి, 76.10 శాతంతో మంగళగిరి, 74.12 శాతంతో ప్రత్తిపాడు, 62.16 శాతంతో గుంటూరు తూర్పు, చిట్టచివరన 57.93 శాతంతో గుంటూరు పశ్చిమ నియోజక వర్గాలు నిలిచాయి.


