తెలుగులో న్యాయమూర్తి తీర్పులు | - | Sakshi
Sakshi News home page

తెలుగులో న్యాయమూర్తి తీర్పులు

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

తెలుగులో న్యాయమూర్తి తీర్పులు కనుల పండువగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కుళ్లిన కూరగాయలతో విద్యార్థులకు భోజనాలా?

తెనాలి రూరల్‌: తెనాలి ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఏకా పవన్‌కుమార్‌ గురువారం తెలుగులో తీర్పులు చెప్పారు. రేపల్లె న్యాయస్థానంలో ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన రెండు న్యాయస్థానాల్లో తీర్పులను తెలుగులో వెలువరించారు. రేపల్లె న్యాయస్థానంలో ఒక ముస్లిం మహిళ విడాకుల వ్యాజ్యంతో పాటు, తెనాలి న్యాయస్థానంలో రెండు ప్రామిసరీ నోటు దావాలలో కూడా తెలుగులో తీర్పులు ఇచ్చారు. కక్షిదారులకు తమ వ్యాజ్యాలు ఎందుకు గెలిచామో, ఎందుకు ఓడామో తెలుసుకోవడానికి తరచుగా తెలుగులో తీర్పులు చెబుతున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

నిజాంపట్నం (రేపల్లె): మండలంలోని గోకర్ణమఠం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ్ఠ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం నుంచే శాస్త్రోక్తంగా వేద పండితుల ఆధ్వర్యంలో మహోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం కూడా వైభవంగా జరిగింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్‌, మాజీ ఎంపీపీ మోపిదేవి హరనాథబాబులు పూజా కార్యక్రమాలలో పాలొన్నారు. ఆలయ అభివృద్ధికి మోపిదేవి వెంకట రమణారావు సోదరులు రూ.3 లక్షలు విరాళమిచ్చారు.

అమరావతి: మండల పరిధిలోని లేమల్లె ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. త్రయాహ్నిక దీక్షతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారి విగ్రహన్ని గర్తంలో ప్రవేశపెట్టారు. భక్త జనుల నామస్మరణల మధ్య ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రత్యేక వేదికపై ప్రతిిష్ఠించారు. అనంతరం స్వామి వారి విగ్రహానికి కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ చేసి దిష్టికుంభంతో వేదపండితులు దిష్టి తీశారు. తరువాత ఋత్విక్కులు సుగంధద్రవ్యాలతో హోమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి పూర్తి చేశారు. అన్నసంతర్పణ నిర్వహించారు.

ఏపీ ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు కృష్ణకిరణ్‌

నాదెండ్ల: మండలంలోని చిరుమామిళ్ల, నాదెండ్ల గ్రామాల్లో గురువారం ఏపీ ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు కృష్ణకిరణ్‌ జిల్లా అధికారులతో కలసి పర్యటించారు. నాదెండ్లలోని రెండు రేషన్‌ దుకాణాలను తనిఖీ చేశారు. 11వ నంబర్‌ షాపులో అదనంగా పది క్వింటాళ్లు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. చిరుమామిళ్ల ఏపీ మోడల్‌ పాఠశాలను సందర్శించారు. వంట గదిలోని కూరగాయలు, నిత్యవసర సరుకుల నాణ్యతపై ఆరా తీశారు. కూరగాయల్లో కొన్ని పాడై దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అనారోగ్యం పాలైతే బాధ్యత ఎవరిదంటూ ప్రిన్సిపల్‌ పద్మజను ప్రశ్నించారు. వసతి గృహంలోని విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను విద్యార్థులు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వారు ఆయన తెలిపారు. బోరు నీరే దిక్కు అని, సమస్య పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement