బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? | - | Sakshi
Sakshi News home page

బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

స్థాయీ సంఘ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల నిలదీత ఇష్టారాజ్యంగా పనులు కేటాయింపుతో జెడ్పీకి ఆర్థిక కష్టాలు ప్రభుత్వం నుంచి రూ.69 కోట్ల వరకు స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జ్‌ నిలిపివేత జెడ్పీ స్థాయీ సంఘాల భేటీలో వివిధ అంశాలపై చర్చ

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గురువారం స్థాయీ సంఘాలు భేటీ అయ్యాయి. సెప్టెంబర్‌లో జెడ్పీ పాలకవర్గ పదవీ కాలం ముగియనుండటంతో గురువారం జరిగిన సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం ఏడు స్థాయీ సంఘాలకుగానూ 1,7వ సంఘాలు మినహా మిగిలిన కోరం లేకపోవడంతో వాయిదా పడ్డాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జెడ్పీలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతోపాటు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. మరో రెండు నెలల్లో పాలకవర్గ పదవీ కాలం పూర్తి కానుండటంతో గ్రామాల్లో పనులు చేయించిన జెడ్పీటీసీలు బిల్లులు చెల్లించాల్సిందిగా అధికారులను నిలదీస్తున్నారు. గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీటీసీలు ఇదే అంశాలపై చైర్‌పర్సన్‌తోపాటు సీఈవో వి.జ్యోతిబసు ఎదుట ప్రస్తావించారు. పూర్తి చేసిన పనులను బిల్లుల చెల్లింపు, ముందస్తు అనుమతుల పేరుతో జెడ్పీ బడ్జెట్‌కు మించి చేసిన కేటాయింపులకు నిధుల కొరత వంటి అంశాలపై సభ్యులు నిలదీశారు.

ప్రభుత్వం చెల్లిస్తేనే...

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జ్‌ రూపంలో ప్రభుత్వం రూ.69 కోట్లు జెడ్పీకి జమ చేయాల్సి ఉంది. కానీ ఇవ్వకపోవడంతో జెడ్పీకి శాపంగా మారింది. అభివృద్ధి పనులకు నిధులు వెతుక్కోవాల్సి రావడంతో పాటు దాదాపు రూ.30 కోట్లకు పైబగా పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జెడ్పీకి వివిధ రూపాల్లో రావాల్సిన నిధుల్లో పైసా విడుదల చేయకపోవడంతో గుంటూరు జెడ్పీ లోటు బడ్జెట్‌లోకి వెళ్లిపోయింది. జెడ్పీ నిధులతో చేపట్టిన పనులతో పాటు వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని చేసిన పనులకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంది. దీంతో సంబంధిత బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నా, లోటు బడ్జెట్‌ కారణంగా అవి తీసుకోవడం లేదు. ఫలితంగా పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపుకు నోచుకోవడం లేదు. మూడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement