అటవీ శాఖ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

అటవీ శాఖ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు ఎయిమ్స్‌లో ఆయుష్‌ విభాగం ప్రారంభం సౌత్‌ జోన్‌ పికిల్‌బాల్‌ పోటీలకు 14 మంది ఎంపిక పలు రైళ్ల దారి మళ్లింపు

బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్‌ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్‌ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్‌ఆర్‌ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్‌ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్‌ ఫిట్స్‌ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్‌ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్‌ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్‌ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ­

మంగళగిరి టౌన్‌: మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యశాలలో ఆయుష్‌ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అహంతం శాంతాసింగ్‌ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో బుధవారం ఆయుష్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్‌ అహంతం శాంతాసింగ్‌ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్‌ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్‌ విభాగంతోపాటు ఎయిమ్స్‌లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్‌ మెడిసిన్‌ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్‌ మెడిసిన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్‌, రాజశేఖర్‌ మోహన్‌, కల్నల్‌ శశికాంత్‌, సన్యాల్‌, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): హైదరాబాద్‌ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్‌ జోన్‌ పికిల్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్‌ బాల్‌ సంఘం కార్యదర్శి జీఎస్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్‌ జోన్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్‌ డెంటల్‌ కేర్‌ అధినేత డాక్టర్‌ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్‌ అందజేశారు. సౌత్‌ జోన్‌ పోటీలలో కూడా మెడల్స్‌ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్‌ జోన్‌ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్‌కుమార్‌, కె.అరుణ్‌కుమార్‌, డి.అభిరామ్‌, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్‌, ఆకాష్‌, చరణ్‌, జీవీఎస్‌ ప్రసాద్‌, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్‌. హవిష్మ్‌, పి.అమృత, కే.కళ్యాణ్‌.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్‌–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్‌ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్‌నగర్‌ టెర్నినస్‌ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు.

Advertisement
 
Advertisement
Advertisement