వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు

గుంటూరు వెస్ట్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్‌ హాస్టల్స్‌ను ఆధునికీకరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో వెల్ఫేర్‌ హాస్టల్స్‌ సంక్షేమ అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, ఆర్‌ అండ్‌బీ శాఖ అధికారులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 67 సంక్షేమ హాస్టల్స్‌ ఉన్నాయని, వాటిలో 32 హాస్టల్స్‌ ప్రభుత్వ భవనాలు కలిగి ఉన్నాయన్నారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతి గృహాల అభివృద్ధి, ఆధునికీకరణకు ‘మార్పు’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఎలాంటి సదుపాయాలు ఉండాలనే విషయమై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అన్ని హాస్టల్స్‌ ఒకే విధానంలో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 28 నాటికి పనులకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాబాయి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ మంజుల, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ చెన్నయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారథి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ల్యాడ్స్‌పై నివేదిక సమర్పించాలి

ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వి.సి. హాల్లో ఎంపీ ల్యాడ్స్‌ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారు తురకపాలెం వద్ద స్లాబ్‌ కల్వర్టు నిర్మాణ పనులు, గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో కర్మశాల భవన నిర్మాణ పనులను విచారించారు. సమావేశంలో సీపీఓ శేషాశ్రీ, వివిధ కార్యనిర్వాహక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు

అమరావతి రాజధానిలోని పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 21న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు బాబా రాందేవ్‌ తదితరులు పాల్గొంటారన్నారు.

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Advertisement
 
Advertisement
Advertisement