గుంతలోకి జారిపడిన ట్రాక్టర్‌.. డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుంతలోకి జారిపడిన ట్రాక్టర్‌.. డ్రైవర్‌ మృతి

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

గుంతలోకి జారిపడిన ట్రాక్టర్‌.. డ్రైవర్‌ మృతి కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

మంగళగిరి టౌన్‌: ట్రాక్టర్‌ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్‌ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్‌బాబు (50) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్‌ ఇంజిన్‌తో డీవాటరింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్‌ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్‌ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్‌ చేస్తున్నాడు. ట్రాక్టర్‌ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న శరత్‌బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్‌ కింద ఇరుక్కుపోయిన శరత్‌బాబును మెగా కంపెనీ అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్‌బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌కు కాపు నాడు వినతి

నెహ్రూనగర్‌: కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి వద్ద ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 2017 డిసెంబర్‌లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలు, హాస్టళ్లు, కల్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చి కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్‌న్‌కు ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. కాపు విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కాపు మహిళా సాధికారత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15,000, 5 సంవత్సరాలకు రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. 2019లో కాపులను బీసీల్లో చేర్చి 9వ షెడ్యూల్‌లో పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై పూర్తిగా పరిశీలించి కాపులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. కాపునాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, వ్యతిరేకం కాదని, రిజర్వేషన్‌, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడే సంస్థ అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement