మీడియాతో రాష్ట్ర మంత్రి భరత్ త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల మందికి ఉపాధి
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.
మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపజేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తోందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలని, పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మంచి ప్రభుత్వానికి, మంత్రి వర్యులకు ముద్రణా రంగ పారిశ్రామికవేత్తల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రింటింగ్ రంగాన్ని ఇప్పటివరకు కేవలం ఒక వ్యాపారంగానే చూస్తున్నారని, దీనికి పూర్తిస్థాయిలో పరిశ్రమగా గుర్తింపు ఇవ్వాలని మంత్రి టీజీ భరత్‌ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కోలా వెంకటరమణ, సలహాదారులు మిక్కిలినేని వెంకట శివప్రసాద్, కార్యదర్శి కట్రగడ్డ మోహన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవీందర్ రెడ్డి, తెలంగాణ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సభ్యులు చక్కా శివప్రసాద్ హర్షారెడ్డి పాల్గొన్నారు.


