మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. మంగళగిరి పట్టణం మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. గత ఫిబ్రవరి 22న చేనేత కార్మికులతో మంగళగిరిలో నిర్వహించిన చేనేత గర్జన, ప్రదర్శన, బహిరంగ సభ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న 48 గంటల నిరాహార దీక్ష చేపట్టినా పాలకుల వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ, మగ్గాలు లేని షెడ్ల కార్మికులు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన వారిని విస్మరించిందని ఆరోపించారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి అందించాల్సిన 25 వేల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయకపోవడం వలన చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చేనేత రంగ పరిరక్షణ కోసం చేపట్టనున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మంగళగిరి హ్యాండ్‌లూమ్ కమిషనర్ కార్యాలయం వద్ద జూన్ 22వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, పి.బాలకృష్ణ, రామారావు, కోటేశ్వరరావు, రవి పాల్గొన్నారు.


