లక్ష్మీపురం: భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి బి.విజయకీర్త్తి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు గుంటూరు రైల్వే డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ పర్యవేక్షణలో ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాలు బుధవారంతో ముగిశాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, రహదారి వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా అధికారులు, సూపర్‌వైజర్లు, భద్రతా సిబ్బంది రక్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పట్టాభిపురం, ఇన్నర్ రింగ్ రోడ్, పెదకపలకలూరు, మంగళగిరి ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే భద్రతా బృందాలు లెవెల్ క్రాసింగ్‌ల సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేడంతోపాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు.
సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయకీర్త్తి


