టీడీపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఏకై క నేత వైఎస్ జగన్ అక్రమ అరెస్టులు, దాడులతో రాజకీయాలను దిగజార్చిన టీడీపీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ‘వెన్నెపోటుకు రెండేళ్లు’ సదస్సు
ప్రశ్నిస్తే అడ్డగోలుగా కేసులు
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం కావాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీనివాసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గస్థాయిలో వెన్నుపోటుకు రెండేళ్లు టౌన్‌హాల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకరవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న సుధాకర్‌బాబు మాట్లాడుతూ టీడీపీ రెండేళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. అవినీతి, అక్రమాలు, రాజకీయ దాడులతో నిండిపోయిన టీడీపీ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని తెలిపారు. వైఎస్సార్ సీపీలో సమర్థుడైన నేతగా ఎదిగిన అంబటి రాంబాబు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి, వైఎస్ జగన్‌కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. గుంటూరు నగరంలో ఎంతో మంది ఉద్దండులైన నేతలు ఎంపీలుగా రాణించిన పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చిన పెద్దమనిషి రాజకీయ దాడులతో గుంటూరులో రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో అధికార మదం దింపుతారని అన్నారు. వైఎస్ జగన్ అంటేనే భయం ఉండటంతో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు జానియర్ ఎన్టీఆర్ అంటే భయమన్నారు. చిరంజీవిని తిట్టిన చింతకాయల విజయ్‌కు చంద్రబాబు రాజ్యసభ పదవిని కట్టబెట్టారని, టీడీపీ బినామీ లింగమనేనికి పవన్ కల్యాణ్ జనసేన తరఫున రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగాను చంపిన వాళ్లే, అంబటిని అంతం చేసేందుకు ఆయన ఇంటిపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన టీడీపీ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు.
సమష్టి కృషి అవసరం
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీ యింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ నోరు తెరవకపోవడంతోనే ఆ అక్రమాలు నిజమని నిర్ధారణ అయిందన్నారు.
టీడీపీ మూడు కోతుల పాలన
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మాట్లాడకుండా, పవన్ కల్యాణ్ వినకుండా, లోకేష్ కళ్లతో చూడకుండా మూడు కోతుల పాలన సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసాలతో నిండి పోయిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు తమను తాము నిందించుకుంటున్నారని అన్నారు. 2029లో వైఎస్ జగనన్న పాలన కోసం రాష్ట్రంలోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ పాలనలో మహిళలపై దాడులు, నేరాలు పెరిగాపోయాయని అన్నారు. సదస్సులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకురాలు నల్లమోతు రూత్‌రాణి, జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రఘుమహంతి వరలక్ష్మీదేవి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వంగల వలివీరారెడ్డి, పోలే ముత్యం, కొల్లి శివరామిరెడ్డి, యర్రం హనిమిరెడ్డి, సింగు నరసింహారావు, మామిడిరాము, కె.విజయమాధవి, కె.చిన్నపరెడ్డి, పఠాన్ సైదాఖాన్, ఈమని రాఘవరెడ్డి, బాల వెంకట్‌రెడ్డి, షేక్ రాజియా బేగం, బాల మురళీకృష్ణ, చదలవాడ రవీంద్రనాథ్, వి.సుబ్బారెడ్డి, దేవరశెట్టి సత్యనారాయణ, సీహెచ్ ధన్వంతరీ భగవాన్, యేటి కోటేశ్వరరావు, పల్లపు మహేష్, వెంకాయమ్మ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పే చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన నేతగా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ.వేల కోట్లు దోచుకోవడం, అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపడం తప్ప చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాంబాబుపై దాడితో రాష్ట్రంలో టీడీపీ పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నెల 12న తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి ఎదురైందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన వాగ్దానాలు చేసినా అవేవీ సాధ్యం కాదని వైఎస్ జగన్ నాడే చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అదే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ... చంద్రబాబు వాగ్దానాలు అమలు కావని తెలిసే ఎక్కడా వాటి గురించి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ తరఫున ప్రజలను చైతన్యం చేసేందుకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో టీడీపీ చేసిన రాజకీయ దాడులు, హత్యలతో అసలైన గొడ్డలి పార్టీగా అదే నిలిచిందని చంద్రబాబు తెలుసుకోవాలని చురకలు అంటించారు.
జూలై 29న వినతి యాత్ర
తన ఇంటిపై దాడికి తెగబడిన దుండగులపై ఇప్పటివరకు కేసులు లేవని అంబటి అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో నిరసన దీక్ష చేశానని చెప్పారు. జూలై 29న గుంటూరు నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి 29 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి డీజీపీకి వినతి పత్రం సమర్పిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లలో భాగంగా ఈ నెల 12న పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు.


