తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్‌లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్‌కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్‌కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు.
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్‌సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు.
ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి
పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్‌ఎల్‌ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్‌ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు.


