జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
తాడేపల్లి రూరల్: ప్రపంచానికి గొప్ప జీవన విధానమైన యోగాను అందించినది భారతదేశమని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన యోగా అని అన్నారు. యోగా అంటే శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం, వివిధ భంగిమల (ఆసనాలు) ద్వారా శరీరాన్ని, మనస్సును ఏకం చేసే అద్భుతమైన ప్రక్రియ అని తెలిపారు. యోగా చేయడం ద్వారా ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈనెల 13వ తేదీన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


