లారీ యాజమానులపై అదనపు భారం మోపవద్దు | - | Sakshi
Sakshi News home page

లారీ యాజమానులపై అదనపు భారం మోపవద్దు

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

● గూడ్స్‌ వాహనాలపై వీఎల్‌టీడీ నిబంధనను అమలుచేయవద్దు ● ఎన్‌ఏఎంటీఏ జిల్లా ఇన్‌ చార్జి సాంబశివరావు

నగరంపాలెం: లారీ యజమానులపై అదనపు భారం మోపవద్దని న్యూ ఆంధ్ర మోటార్‌ ట్రాన్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఏఎంటీఏ) జిల్లా ఇన్‌న్‌చార్జి సాంబశివరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గూడ్స్‌ క్యారేజ్‌ వాహనాలపై వెహికల్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ డివైస్‌(వీఎల్‌టీడీ)ను తప్పనిసరి చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తద్వారా లారీ యజమానులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం జారీ చేసిన రూల్‌ 125 హెచ్‌, 2018 నాటి వీఎల్‌టీడీ మార్గదర్శకాల్లో ప్రధానంగా పబ్లిక్‌ సర్వీస్‌ వెహికల్స్‌ గురించే ప్రస్తావించారని అన్నారు. గూడ్స్‌ క్యారేజ్‌ వాహనాలకు వీఎల్‌టీడీ తప్పనిసరి అమలుపై చట్టపరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. గతనెల 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలలో వీఎల్‌టీడీ, పానిక్‌ బటన్‌ అమలుపై దృష్టి సారించిందని, గూడ్స్‌ వాహనాలపై తప్పనిసరి అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా అనే విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. డీజిల్‌ ధరల పెరుగుదల, టోల్‌ ఫీజులు, బీమా ప్రీమియంలు, టైర్లు, స్పేర్‌ పార్ట్స్‌ ధరలు, బ్యాంకు రుణాల వడ్డీలు పెరుగుతున్న దృష్ట్యా లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి వేళ ఒక వాహనానికి వీఎల్‌టీడీ పరికరం కొనుగోలు, అమరిక, వార్షిక నిర్వహణ, సిమ్‌, సాఫ్ట్‌వేర్‌ ఛార్జీల రూపంలో వేలాది రూపాయల అదనపు వ్యయం మోపడంతో చిన్న, ముధ్య తరహా లారీ యజమానులకు భారంగా మారుతుందని వాపోయారు. గూడ్స్‌ వాహనాలపై వీఎల్‌టీడీ తప్పనిసరి అమలుకు ఉన్న చట్టపరమైన ఆధారాన్ని ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని అన్నారు. రూల్‌ 125 హెచ్‌, 2018 వీఎల్‌టీడీ మార్గదర్శకాలపై అధికారిక స్పష్టీకరణ జారీ చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు ఫిట్‌నెస్‌, పర్మిట్‌, బ్యాక్స్‌, ఇతర పరిపాలనా చర్యలలో వీఎల్‌టీడీ నిబంధనను అమలు చేయరాదని డిమాండ్‌ చేశారు. చిన్న, మధ్య తరహా లారీ యజమానులకు ఆర్థిక భారం తగ్గించే చర్యలు చేపట్టాలని అన్నారు. లారీ యజమానుల న్యాయమైన ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రంలోని ట్రాన్‌న్స్‌పోర్ట్‌ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రవాణా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధానాల కంటే, ట్రాన్స్‌పోర్ట్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement