న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

● విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ● విజ్ఞాన్‌లో కొనసాగుతున్న న్యాయవాదుల శిక్షణ తరగతులు

చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఏఐఎల్‌యూ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ లాయర్స్‌’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్‌ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్‌యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్‌, నల్లూరి మాధవరావు, కె.కుమార్‌, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు తుమ్మేటి రమేష్‌, తుమ్మల శ్రీకుమార్‌, న్యాయవాదులు సీవీఎల్‌ఎన్‌ మూర్తి, బైరపునేని నరేష్‌, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement