ఆగస్టులో ప్రత్యేక అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగస్టులో ప్రత్యేక అదాలత్‌

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

ఆగస్టులో ప్రత్యేక అదాలత్‌ ముగిసిన ఏపీ పీ సెట్‌–2026 పరీక్షలు పికిల్‌ బాల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ జీజీహెచ్‌లో డీఎంఈ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు లీగల్‌: సమాధన్‌ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్‌ షేక్‌ సికిందర్‌ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్‌ అదాలత్‌ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు లోక్‌ అదాలత్‌ లో సెటిల్‌ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్‌ అదాలత్‌ ఫారాలు, హెచ్‌టీటీఎస్‌://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌సీఐ.జీవోవి.ఇన్‌ సుప్రీంకోర్టు వెబ్‌ సైట్‌లోను, జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్‌మెంట్‌ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్‌ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్‌–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాల్‌కుమార్‌ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్‌ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, సెటిల్‌ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్‌ బాల్‌ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్‌ పికిల్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్‌ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్‌ బాల్‌ సంఘం కార్యదర్శి జీఎస్‌ ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్‌ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్‌ బాల్‌ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్‌ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్‌ జోన్‌ పికిల్‌ బాల్‌ పోటీల్లో మెడల్‌ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం రాత్రి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్‌ షీట్‌లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారీ, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ బి.సతీష్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement