నరసరావుపేట: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అక్రమ అరెస్టును గమనిస్తే ఆంధ్రాలో మాదిరిగానే చంద్రబాబునాయుడు శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేశారనిపిస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్‌సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బాధితులపైనే కేసు పెట్టడమంటే కూటమి ప్రభుత్వం డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నాడన్నారు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన బొల్లాను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయటం అనైతికం అన్నారు. బొల్లా కుటుంబానికి పార్టీ, ఎస్సీ సెల్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు బొల్లా అండగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడుతూ ఒక తప్పుడు ఫేక్ కేసుతో బొల్లాను అరెస్టు చేశారన్నారు. బొల్లాకు 70 ఏళ్ల వయస్సుతో పాటు గుండె ఆపరేషన్ జరిగిందని, భూమి కొనుగోలులో బాధితుడైన బొల్లాను అరెస్టు చేయటం హేయం అన్నారు. తమ పార్టీ సమస్యలు, బెదిరింపులకు భయపడే పార్టీ కాదన్నారు. ఎదురెళ్లి ధమ్ము, ధైర్యంతో పోరాటం చేస్తోందని, కడిగిన ముత్యంలా బొల్లా బయటకు రావటం ఖాయమన్నారు. పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.


