సిబ్బందికి సున్నితంగా హెచ్చరికలు
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికంలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్‌ను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సందర్శించారు. వచ్చే అర్జీలు, వాటి అప్‌లోడ్ విధానం, అధికారులు ఇచ్చే పరిష్కార మార్గాలు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి ఆయన కొంతమంది బాధితులతో మాట్లాడి. పరిష్కార మార్గాలను అధికారులకు సూచించారు.
పాత రికార్డులు అడగవద్దు
1900 నాటి రికార్డుల కోసం అర్జీదారులను ఇబ్బంది పెట్టద్దని అధికారులకు సీఎస్ సూచించారు గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 1239లో ఎకరం 69 సెంట్లు రిజిస్టర్ భూమిని తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేశామని, ఆ తర్వాత వాగు పోరంబోకుగా తేల్చి 22/ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆ ప్రాంతవాసులు పశ్చిమ మండల అధికారులకు అర్జీ అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న నివాసాలను కూల్చివేస్తున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. భూమి డాక్యుమెంట్లు 1900 సంవత్సరం నుంచి కావాలని అధికారులు అడగగా అక్కడే ఉన్న సీఎస్ స్పందించారు 1900 రికార్డులు వారి దగ్గర ఎలా ఉంటాయని, ఒకవేళ అవి తెస్తే మొగలుల కాలంనాటి రికార్డులు అడుగుతారా అని సిబ్బందికి చురకలంటించారు.
అధికారులు ఉక్కిరి బిక్కిరి
సీఎస్ సాయి ప్రసాద్ రావడం, అక్కడే మూడు గంటలపాటు ఉండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎస్ రెవెన్యూ క్లినిక్‌కు వచ్చే సమస్యలు వాటి అప్‌లోడ్ వంటి వివరాలను తెలుసుకునేందుకు వచ్చానని మీరు కంగారు పడకండి అని సిబ్బందికి ధైర్యం నింపారు. ముఖ్యంగా కొత్తగా తహసీల్దార్ బాధ్యతలు తీసుకునేవారు గతంలో ఉన్న భూ సమస్యల కేసులను స్టడీ చేయాలని సూచించారు. సర్వేలో ప్రైవేటు వ్యక్తుల జోక్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎస్ రావటం అదే సమయంలో యువతి ఆత్మహత్య, కరెంటు కోత వంటి ఘటనలతో అధికారులు ఇబ్బంది పడ్డారు.


