రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్
పెదకాకాని: రైతులు ఏపీ ఏఐఎంఎస్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు మన గ్రోమోర్, వెనిగండ్ల దనీత్ ఎంటర్‌ప్రైజెస్ ఎరువులు, పురుగుమందులు షాపుల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఏపీ ఏఐఎంఎస్(వ్యవసాయ సమాచార నిర్వహణ విధానం) యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులు తమ పంట నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది రైతుల అవసరాల మేరకు ఎరువుల లభ్యత ఉంటుందని చెప్పారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని డీలర్ల ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. వర్షం పడితే పొలాలకు ఎరువులు చేరడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే ఎరువులు ఇవ్వాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ యాప్ ద్వారా ఆరుగురు రైతులకు 15 బస్తాలు యూరియా ఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ కార్యాలయం ఎస్‌ఈఐటీ సెల్ బాల సుబ్రహ్మణ్యం, ఏడీఏ ఫర్టిలైజర్స్ రాజన్, డీడీ ఫర్టిలైజర్ ఎం.ఆనంద్‌రావు, వ్యాసర్ ల్యాబ్ హరి, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మ పీడీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేత్ బాచావో అభియాన్ కార్యక్రమం పెదకాకాని సచివాలయంలో నిర్వహించారు. ఏడీఏ ఎన్ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్
గుంటూరు మెడికల్: బ్రెయిన్ ట్యూమర్లు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉందని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ అన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌మెడికల్ సెన్సెస్ హాస్పటల్‌లో బ్రెయిన్ ట్యూమర్స్‌పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. డాక్టర్ నరేన్ మాట్లాడుతూ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెదడులో ట్యూమర్ ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఎమ్మారై ట్రాక్టోగ్రఫీ నేడు అందుబాటులో ఉందన్నారు. ట్యూమర్ స్వరూపాన్ని కచ్చితంగా నిర్ధారించే న్యూరో నావిగేషన్ గైడెడ్ బయాస్పి వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్లు ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చన్నారు. బ్రెయిన్ ట్యూమర్లు అని క్యాన్సర్‌కు దారి తీయవని, మెనిమ్‌జియోమా వంటి కొన్ని ట్యూమర్‌లను ఆపరేషన్ ద్వారా తొలగిస్తే జీవితాంతం మరలా రావని సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు అన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూష మాట్లాడుతూ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కాదని, తలనొప్పితోపాటు ఇతర నాడి సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ ప్రారంభ దశలో ట్యూమర్లను గుర్తిస్తే కేవలం ఆపరేషన్ ద్వారానే 90 నుంచి 95 శాతం విజయవంతంగా నయం చేయవచ్చు అన్నారు. అవగాహన సదస్సులో 300 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు. బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన సోమవారం కొనసాగాయి. తొలి ప్రదర్శనగా ఆరభి యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్, రాప్తాడు వారి ‘డొక్కా సీతమ్మ’ నాటికను ప్రదర్శించారు. ఆముదాల సుబ్రమణ్యం రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మగా భావిక, పెద్ద సీతమ్మగా యశోదమ్మ, ఇతర పాత్రల్లో బాషా, అరుణ్‌బాబు తదితర 30 మందికి పైగా నటీనటులు నటించారు. తదుపరి గర్తపురి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘5జీ కపుల్స్’ నాటికను ప్రదర్శించారు. ఎస్‌కేడీ హస్సన్ రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా ఎన్‌ఎంఆర్ క్రియేషన్స్, అనకాపల్లి వారి ‘వేదాంతం’ నాటికను ప్రదర్శించారు. ప్రఖ్యాత సాహితీవేత్త గుడిపాటి వెంకటాచలం మూలకథకు మార్గశీర్ష నాటకీకరించగా, ముత్యాలరావు పొన్నాడ దర్శకత్వం వహించారు. తొలినాటిక ప్రఖ్యాత సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మ జీవితానికి సంబంధించినది కాగా, ఇతర నాటికలు సందేశాత్మక ఇతివృత్తంతో సాగాయి.


