లోతైన అధ్యయనం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోతైన అధ్యయనం చేయాలి

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

చట్టంలోని నిబంధనలు లోతైన అధ్యయనం చేయాలి

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి విజ్ఞాన్‌లో ప్రారంభమైన న్యాయవాదుల శిక్షణ తరగతులు

చట్టంలోని నిబంధనలు

చేబ్రోలు: కోర్టులో తుది తీర్పు వెలువడే వరకు పక్షాల హక్కులను రక్షించేందుకు ఇంటర్‌ లాక్యుటరీ అప్లికేషన్స్‌ కీలక సాధనాలు, న్యాయవాదులు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమర్థవంతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీహెచ్‌ఆర్‌సీ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఏఐఎల్‌యూ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ మరియు విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా సంయుక్త ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల ‘‘ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ లాయర్స్‌’’ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను ఆంధ్రప్రదేశ్‌ మాజీ హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఏపీహెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ ఎం. సీతారామమూర్తి, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య కలిసి ప్రారంభించారు. జస్టిస్‌ సీతారామమూర్తి మాట్లాడుతూ ఇంటర్‌లాక్యుటరీ అప్లికేషన్స్‌ దాఖలు చేసే సమయంలో న్యాయవాదులు చట్టంలోని నిబంధనలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.

ఏఐ యుగానికి న్యాయవాదులు సిద్ధం కావాలి

విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ నేటి ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం న్యాయవృత్తిపైనా స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు అనుగుణంగా న్యాయవాదులు సిద్ధం కావాలని అన్నారు. భవిష్యత్‌ న్యాయరంగం, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్‌ నేరాలు, మానవ విలువల ప్రాధాన్యతపై విశదీకరించారు. కృత్రిమ మేధస్సు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, పరిపాలనతో పాటు న్యాయరంగంలోనూ వేగంగా ప్రవేశిస్తోందన్నారు. న్యాయపరమైన పరిశోధనలు, కేసుల విశ్లేషణ, చట్టాల అధ్యయనం, తీర్పుల అన్వేషణ, పత్రాల తయారీ వంటి అనేక అంశాల్లో ఇప్పటికే ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు కూడా తమ పనితీరును ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో సాంప్రదాయ నేరాల కంటే సైబర్‌ నేరాలే పెద్ద సవాలుగా మారనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జీ. ప్రతిభాదేవి, ఏఐఎల్‌యూ అఖిల భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌, ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, బెజవాడ, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వి లక్ష్మీ నారాయణ, ఎం నాగేశ్వరరావు, ఏఐఎల్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement