పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ పసుపు యార్డును ముట్టడించిన రైతులు
దుగ్గిరాల: శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వం వాగ్దానం మేరకు క్వింటాకు రూ.7వేలు పరిహారం వడ్డీతో సహా చెల్లించాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం దుగ్గిరాలలోని పసుపు యార్డు ముట్టడి కార్యక్రమం సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా యార్డుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పసుపు రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు. ముందుగా యార్డు బయటకు వెళ్లే మార్గంలో బైటాయించారు. రైతులను ఉద్దేశించి శివశంకర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పసుపు ఽక్వింటాకు రూ.13,400 ఉండగా, ప్రభుత్వం రైతులు, వ్యాపారులతో చేసిన ఒప్పందం ప్రకారం రూ.7 వేలు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలు గడిచినా పసుపు రైతులకు పూర్తి పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ నిల్వ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పసుపు దగ్ధం కావడానికి కారణమైన యజమానిని కఠినంగా శిక్షించాలని కోరారు. యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి డి.చిన సుబ్బారావుకి వివతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానిని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వల్లూరి భారతి, గద్దె శ్రీహరి, కాజా వెంకటేశ్వరరావు, జెట్టి బాలరాజు, పి.రవికిషోర్, బి.చిన్న వెంకటరెడ్డి, ఎన్.యోగేశ్వర రావు, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు.


