జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ పరీక్షల్లో 17 మందికి పాజిటివ్
నగరంపాలెం: జిల్లాలో ఎవరి దగ్గరైనా గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు సబ్ డివిజన్‌లోని కొత్తపేట పీఎస్, పాతగుంటూరు పీఎస్, లాలాపేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి నేరస్తులకు సోమవారం బీఆర్ స్టేడియంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, గంజాయి కేసుల్లోని నేరస్తులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం ఏయే పనులకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ నివసిస్తున్నారనే అంశాలపై ఆరాతీశారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తూర్పు సబ్ డివిజన్‌లోని రౌడీషీటర్స్, పాత గంజాయి కేసులున్న 120 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ (డిడికె)తో పరీక్షలు నిర్వహించగా అందులో 17 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు వీరయ్య (కొత్తపేట పీఎస్), వెంకటప్రసాద్ (పాత గుంటూరు పీఎస్), ఎస్‌ఐలు రెహమాన్ (పాతగుంటూరు పీఎస్), రవి (లాలాపేట పీఎస్) సునీల్ (ఈగల్ ఆర్‌ఎస్‌ఐ) పాల్గొన్నారు.


