నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డులో సోమవారం నుంచి మిర్చి క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి ఎండ తీవ్రత కారణంగా యార్డులో పనిచేసే హమాలీలు, కూలీల సూచనల మేరకు మే నెల 7 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. మిర్చి రైతులు సోమవారం నుంచి యార్డుకు తమ సరుకును తీసుకువచ్చి విక్రయించుకోవచ్చని ఆమె సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యాన సైకిల్‌ ర్యాలీ సిలంబం విజేత గుంటూరు జిల్లా కనకదుర్గ వారధిపై కారు దగ్ధం

నగరంపాలెం: వాహనాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని జిల్లా ఎస్‌బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై జిల్లా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బీవీ నారాయణ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్‌ మీదుగా ఎంటీబీ సెంటర్‌ వరకు సాగింది. అక్కడి నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీనివాస్‌ మాట్లాడుతూ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని అన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. జిల్లా ఏఆర్‌ డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని తెలిపారు. ర్యాలీలో ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్‌, రామకృష్ణారెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): రాష్ట్ర స్థాయి సిలంబం సబ్‌ జూనియర్‌, సీనియర్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా గుంటూరు జిల్లా నిలిచింది. స్థానిక బీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌ ఖాన్‌ ఆదివారం ప్రారంభించారు. సిలంబం స్టిక్‌ ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ క్రిస్టఫర్‌ మాట్లాడుతూ పోటీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ప్రథమ స్థానంలో గుంటూరు జిల్లా, ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచాయన్నారు. అనంతరం విజేతలకు అఫ్రోజ్‌ ఖాన్‌తోపాటు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇ. అశోక్‌బాబు, క్రిస్టఫర్‌లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోచ్‌లు కాశీనాథ్‌రెడ్డి, సీహెచ్‌ శ్రీరామ్‌, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్‌, వెంకటసాయి, నాంచారయ్య, నవీన్‌ పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్‌లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని తన కుటుంబ సభ్యులు నలుగురిని కిందకు దించారు. క్షణాల్లో కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్‌టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ఫైర్‌ ఇంజిన్‌ తెప్పించి మంటలు అదుపుచేశారు. అరగంటపాటు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాతూరు రోడ్డు వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement