నరసరావుపేట రూరల్: టీడీపీ నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఆలయ అర్చకులపై కూడా అమలు చేస్తున్నారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే గుడి నుంచి బయటకు వెళ్లాలని అర్చకులకు హుకుం జారీ చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా తాము పనిచేయలేమని చెప్పినందుకు కక్ష సాధిస్తున్నారు. వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న కంకణధారణను రద్దు చేయించారు. ఆలయంతో సంబంధం లేని పూజారులతో ఆదివారం కంకణధారణకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రయత్నించారు. వారిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న కంకణధారణలో రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో అర్చక కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీనిపై కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు పాల్గొనకూడదంటూ తేల్చిచెప్పారు. తమ తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా వదలుకుంటామంటూ అర్చకులు కంకణధారణను కొనసాగిస్తున్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆలయంలో కంకణధాణను రద్దు చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వీవీఎస్‌కే ప్రసాద్ ఈనెల 2వ తేదీ ఆదేశాలు జారీ చేశారు.
ఇరువర్గాల వాగ్వాదం
ఆదివారం ఉదయం ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్‌లు ప్రైవేటు అర్చకులతో కంకణధారణ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజాదికాలు నిర్వహించాలని అర్చకులను కోరారు. దీనికి అర్చకస్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారికి నివేదనతో పూజాదికాలు నిర్వహించిన అనంతరమే కంకణాలను ఇస్తామని స్పష్టంచేశారు. భక్తుల నమ్మకాలతో వ్యాపారం చేయలేమని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన కంకణాలనే భక్తులకు అందిస్తామని తేల్చిచెప్పారు. కంకణాలకు పూజలు జరిపేందుకు ప్రైవేటు అర్చకుడిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించారు. దీనిని ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్వ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ అర్చకులకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇస్సపాలెం ఆలయ అర్చకులకు
టీడీపీ నేతల వేధింపులు
తాజాగా కంకణధారణ
రద్దు చేయించిన నాయకులు
ప్రైవేటు అర్చకులతో
నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు
అడ్డుకున్న ఆలయ అర్చకులు...
ఆలయంలో ఉద్రిక్తత


