తాడికొండ: రాజధానికి మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న లారీలను తాడికొండలో గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రిళ్లు అధిక వేగంతో వస్తున్న లారీ మలుపు వద్ద యువకుడిని ఢీకొట్టబోవడంతో అప్రమత్తమైన అతను త్రుటిలో తప్పుకున్నాడు. గతంలో సైతం గ్రామంలో అధిక వేగంతో వెళుతున్న లారీల కారణంగా ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగిన నేపధ్యంలో స్థానిక ట్యూబ్‌లైట్ సెంటర్‌లో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద యువకులు రోడ్డుపై లారీలను అడ్డుకొని నిరసన తెలియజేశారు. రాజధానికి వెళ్లే పలు లారీలు బారులు తీరి నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులతో చర్చించగా గ్రామంలో లారీలు అధిక వేగంతో వెళుతున్న కారణంగా పడుతున్న ఇబ్బందులు తెలియజేశారు. పేరేచర్ల ప్రాంతం నుంచి రాజధాని నిర్మాణాలకు వెళ్ళే కంకర, ఫ్‌లైయాష్‌తో వెళ్లే లారీలతో పాటు ఇతర సామగ్రి రవాణా లారీలు, రాజధాని నుంచి అక్రమంగా తరలిస్తున్న నల్లమట్టి, ఇసుక లారీలు రోడ్లపై నిత్యం హోరెత్తిస్తున్నాయని, అధిక శబ్ధంతో కూడిన వాహనాలు అధిక వేగం కారణంగా రోడ్డుపై నడవాలంటే భయందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు పెరిగిన రద్దీ దృష్ట్యా లారీలు, ఇతర రాజధాని వాహనాల రవాణా కోసం గ్రామ శివారు నుంచి బైపాస్ రహదారి నిర్మించిలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తాడికొండ పోలీస్ స్టేషన్‌లో మితిమీరిన వేగంతో వస్తున్న లారీలపై ఫిర్యాదు చేశారు.
రాజధాని ప్రాంతానికి మట్టి, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి తరలిస్తూ
అధిక వేగంతో వెళ్తున్న లారీలు
ప్రమాదాలబారిన ప్రజలు
తాడికొండలో లారీలను ఆపి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన
పోలీసులు


