సెన్సారు బోర్డు సభ్యురాలిగా యార్లగడ్డ శైలజ | - | Sakshi
Sakshi News home page

సెన్సారు బోర్డు సభ్యురాలిగా యార్లగడ్డ శైలజ

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

సెన్సారు బోర్డు సభ్యురాలిగా యార్లగడ్డ శైలజ

తెనాలి: దూరదర్శన్‌ విశ్రాంత డెప్యూటీ డైరెక్టర్‌ (ప్రోగ్రామ్స్‌) యార్లగడ్డ శైలజ కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. సెంట్రల్‌బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ సభ్యురాలిగా, హైదరాబాద్‌ రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారు.

సొంతూరు రూరల్‌ మండలం గుడివాడ

యార్లగడ్డ శైలజ సొంతూరు తెనాలి రూరల్‌ మండల గ్రామం గుడివాడ. తల్లిదండ్రులు పిన్నక వెంకటేశ్వరరావు తెలుగు పండితులు. అమ్మ చారుమతి హార్మోనియం ప్లేయర్‌. తెనాలిలో బీఎస్సీ, భీమవరంలో ఎంఏ (తెలుగు) చదివాక, మీడియాపై ఆసక్తితో 1984లో పూణేలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో టెలివిజన్‌ ప్రోగ్రాం ప్రొడక్షన్‌ కోర్సు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని దూరదర్శన్‌ కేంద్రంలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా ఉద్యోగజీవితం ఆరంభించారు. 1990–99 వరకు కర్ణాటకలోని గుల్బర్గా దూరదర్శన్‌లో పనిచేశారు. అక్కడ్నుంచి అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌గా పదోన్నతిపై విజయవాడ దూరదర్శన్‌ కేంద్రానికి బదిలీపై వచ్చారు. 2005లో మళ్లీ పదోన్నతిపై డెప్యూటీ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే 2015లో రిటైరయ్యారు.

విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన

దూరదర్శన్‌లో విభిన్న కార్యక్రమాలు, డాక్యుమెంటరీల రూపకల్పన చేశారు. 1992–93లో ఉత్తమ టీవీ ప్రొడ్యూసర్‌గా ఈసీటీవీ అవార్డు అందుకున్నారు. ‘పెంబర్తి కళారూపాలు’పై చేసిన డాక్యుమెంటరీకి 1994లో రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు దక్కింది. శైలజ రూపొందించిన ‘మనసంటూ ఉంటే’ ఉత్తమ మహిళా కార్యక్రమంగా 2001లో దూరదర్శన్‌ జాతీయ అవార్డు లభించింది. కలంకారి కళపై తీసిన డాక్యుమెంటరీకి కూడా అదే ఏడాది దూరదర్శన్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు.

వరించిన బంగారు నంది

క్లిష్టమైన శాసీ్త్రయ నాట్యాన్ని సాధారణ ప్రజలకు కూడా అర్థమయేలా 2005లో ‘మువ్వల సవ్వడి’ని రూపొందించారు. వంద ఎపిసోడ్లుగా ప్రసారం చేసిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపుతోపాటు 2007లో బంగారు నందిని అందుకున్నారు. ఇందులోనే రిలేటివ్‌ స్పెషల్‌, తర్వాత 15 ఏళ్ల బాలల కోసం ‘చిరుమువ్వల సవ్వడి’ని రూపొందించి మరో వంద ఎపిసోడ్లను ప్రసారం చేశారు. ఈ పరంపరంలోనే ‘గానగంధర్వం’ మరో యాభై ఎపిసోడ్లు వచ్చింది. రైతుల కోసం ‘రైతే రాజు’, ‘గామదర్శిని’ తీసుకొచ్చారు. ప్రసారభారతి ప్రారంభించిన ‘ఇండియా ఇన్నోవేషన్స్‌’లో భాగంగా చింతకింది మల్లేశం, బొమ్మగాని మల్లేష్‌ వంటి సృజనకారుల్ని పరిచయం చేశారు. రిటైరయ్యాక 2016 నుంచి ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో ఓ విభాగానికి అధిపతిగా ఉంటున్నారు. ఇప్పుడు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా మరో బాధ్యతల్లోకి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement