సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

మంగళగిరి టౌన్‌: సెక్యూరిటీ గార్డ్స్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేషనల్‌ కోఆర్డినేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ అండ్‌ అలైడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జాతీయ కన్వీనర్‌ ఎం.సాయిబాబా పిలుపునిచ్చారు. మంగళగిరి సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సెక్యూరిటీ గార్డ్స్‌ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సాయిబాబా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యవసాయ కార్మికుల తర్వాత కోటిమందికి పైగా సెక్యూరిటీ గార్డ్స్‌గా పని చేస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వ రంగంలో సెక్యూరిటీ గార్డ్స్‌ ఉండేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రెగ్యులైజేషన్‌ ఉద్యోగులుగా కూడా పనిచేశారని, ప్రస్తుతం సెక్యూరిటీ రంగం మొత్తం ప్రైవేటుపరం అయిందన్నారు. ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏజెన్సీల ద్వారా సెక్యూరిటీ గార్డ్స్‌ను పెట్టుకోవడం జరుగుతుందని, దీనివలన ఏజెన్సీ నిర్వాహకులు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో కనీస వేతన చట్టం చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలైనా కనీస వేతన చట్టం సవరణ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో సంస్థలలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి ఆయా ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.893 ల నుంచి 1065 వరకు వేతనంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐలను అమలు చేయాలని, ఈఎస్‌ఐ కార్డులను సెక్యూరిటీ గార్డులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళా సెక్యూరిటీ గార్డులకు చట్టపరమైన భద్రత కల్పించాలని అన్నారు. ఏజెన్సీలు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధక్షుడు ముజఫర్‌ అహ్మద్‌, సీఐటీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, మంగళగిరి ఎయిమ్స్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ కార్యదర్శి కె.బుజ్జిబాబు, సీఐటీయూ సీనియర్‌ నాయకుడు జేవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement