పాలనపై ప్రశ్నిస్తే కేసులా? | - | Sakshi
Sakshi News home page

పాలనపై ప్రశ్నిస్తే కేసులా?

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

మరో మూడేళ్లు కష్టాలే..

మీడియా సంస్థలు, జర్నలిస్టులను

చంద్రబాబు బెదిరించడం దారుణం

టీడీపీకి అనుకూలంగా భజన చేసే వారిపై కేసుల ఊసే లేదు

చంద్రబాబు పాలనా వైఫల్యంపై

నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం

వెన్నుపోట్లను మెట్లుగా మలచుకుని ఎదిగిన చంద్రబాబు

వైఎస్‌ జగన్‌ను దూరం చేసుకుని బాధపడుతున్న ప్రజలు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అంబటి రాంబాబు

గుంటూరు ఎడ్యుకేషన్‌: టీడీపీ ప్రభుత్వ అసమర్థ పాలన, నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజలకు వచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లాడ్జి సెంటర్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్‌ సంతకాలు చేసిన సూపర్‌సిక్స్‌ ప్రతులను అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమాలు తగులబెట్టారు.

అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ... సొంతమామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు తన జీవితంలో అనేక మందిని వెన్నుపోటు పొడుచుకుంటూ పైకి వచ్చారని అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటులో భాగంగా 9వ తేదీన టౌన్‌ హాల్‌ సదస్సు, 12న భారీ ర్యాలీతో ప్రజల్లోకి వెళతామన్నారు.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారన్నారు. 11 సీట్లు వచ్చాయని ఎగతాళి చేస్తున్న టీడీపీ నాయకులకు వైఎస్‌ జగన్‌ను చూసి అంత భయమెందుకని ప్రశ్నించారు.

అడ్డగోలుగా కేసులు పెడతారా?

ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెడతామని చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని, అసమర్థ పాలనపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఇదేనా ప్రజాస్వామ్యమని నిలదీశారు. టీడీపీకి భజన చేస్తే కేసులు ఉండవా అన్నారు.

వైఎస్‌ జగన్‌ను దూరం చేసుకున్న ప్రజలు

చంద్రబాబు రెండేళ్ల పాలన చూసిన ప్రజలు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఎందుకు దూరం చేసుకున్నామా అని బాధపడుతున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు గడప తట్టేవని, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన విధానంతో దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు.

సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు పాలన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆరోపించారు. సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు తప్ప, ప్రజా పరిపాలన లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌వలి, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు ఈచంపాటి వెంకటకృష్ణ, వంగల వలి వీరారెడ్డి, యక్కల కోటి లింగా రెడ్డి, బోయపాటి కిషోర్‌, రెడ్డి కోటేశ్వరరావు, బూసి రాజలత, అచ్చాల వెంకటరెడ్డి, షేక్‌ రోషన్‌, పల్లపు వెంకటేష్‌, సాంబశివరావు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పటాన్‌ సైదా ఖాన్‌, వినోద్‌, సత్యనారాయణ, కొరిటిపాటి ప్రేమ కుమార్‌, నాయకులు ఓలేటి అరవింద్‌, దీపక్‌, వెంకటేష్‌ రెడ్డి, వెంకాయమ్మ, వెంకటేష్‌ నాయక్‌, జగన్‌ కోటి, శివ పార్వతీ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. చెత్తబుట్టలో పడేసిన చిత్తు కాగితాలు డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి తగులబెడతారని, అదే చెత్తను తాము రోడ్డుపై తగుల బెడుతున్నామని అన్నారు. టీడీపీ పాలన ప్రజల కోసం కాదని, అమరావతిలో బినామీల పేరుతో ఉన్న భూములను కాపాడుకునేందుకు, కాంట్రాక్టర్లకు జేబులు నింపి, వాటిలో కమీషన్ల కోసమే పాలన సాగుతోందన్నారు. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైఎస్సార్‌ సీపీ మరింతగా బలోపేతం అవుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మహిళలను మోసగించారని ఆరోపించారు. పాలన అంతా అవినీతిమయంగా మారిందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement