సహాయకులకు సమస్యలు | - | Sakshi
Sakshi News home page

సహాయకులకు సమస్యలు

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

● గర్భిణులు, బాలింతల కోసం వచ్చిన వారికి తప్పని ఇబ్బందులు ● గుంటూరు జీజీహెచ్‌లో నూతన భవనంలో కల్పించని వసతి

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో గర్భిణులు, బాలింతల కోసం వచ్చిన సహాయకులకు కనీస వసతులు లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. జీజీహెచ్‌లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ. 100 కోట్లు విరాళంగా అందించడంతో కానూరి రామచంద్రరావు జింకానా మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించారు. ప్రభుత్వం రూ. 26 కోట్ల వైద్య పరికరాలు అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో ఎంసీహెచ్‌ భవనం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఐదంతస్తుల భవనంలో 600 పడకలతో మాతా శిశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య సేవలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు మించి ఉన్నప్పటికీ రోగుల సహాయకులకు కనీస సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. జీజీహెచ్‌కు పలు జిల్లాలకు చెందిన గర్భిణులు కాన్పు కోసం వస్తున్నారు. ప్రసవం అనంతరం అత్యవసర చికిత్సల కోసం పలు జిల్లాలకు చెందిన చిన్నారులను జీజీహెచ్‌కు తీసుకొస్తున్నారు. భవనం మెట్లపైనే ద్వారాల వద్ద రోగుల సహాయకులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

వానాకాలం వస్తే మరిన్ని కష్టాలు

గుంటూరు జీజీహెచ్‌లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులు, బాలింతల కోసం, చిన్నారుల చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకుల సంఖ్య అధికంగానే ఉంటుంది. కాన్పు సమయంలో ఆందోళన, అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, ఇతర వస్తువులు తెచ్చుకునేందుకు గర్భిణికి ఇరువురు సహాయకులు తప్పనిసరి. అలాంటి వారికి ఎంసీహెచ్‌ భవనం లోపల వేచి ఉండేలా ప్రత్యేక వసతి కల్పించాల్సి ఉంది. ఒకపక్క ఎండలు మండుతున్నా సహాయకులు పగడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే మరింత ఇక్కట్లు తప్పవు. ఎంసీహెచ్‌ భవనంలో సౌకర్యాలు కల్పించలేని పక్షంలో ఎదుట ఖాళీగా ఉన్న స్థలంలో వసతి ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉండి, వైద్యులు పిలిచినప్పుడు లోపలకు వస్తుంటారు. రూ. 100 కోట్లకుపైగా దాతలు విరాళాలు అందజేసినప్పటికీ గతంలో పాత కాన్పుల విభాగంలో మాదిరిగానే నేటికీ సహాయకులకు వేచి ఉండే గదులు లేక అవస్థలు పడుతున్నారు.

సిబ్బంది కొరతతో కష్టాలు

నూతన ఎంసీహెచ్‌ భవనంలో విశాల గదులు ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు తగిన సిబ్బంది లేరు. ప్రభుత్వం వైద్య పరికరాలకు రూ. 26 కోట్లు మంజూరు చేసింది. సరిపడా నర్సింగ్‌ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగుల నియామకాలు చేపట్టలేదు. గత ప్రభుత్వం నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ను నాట్కో ట్రస్టు వారు నిర్వహిస్తే, అందులో నర్సింగ్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగులను 110 మందికిపైగా ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ చేసి భర్తీ చేసింది. తద్వారా నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో నేడు అంతర్జాతీయ వైద్య సేవలు లభిస్తున్నాయి. ఎంసీహెచ్‌ భవనంలో అదే స్థాయిలో వైద్య సేవలు అందాలంటే ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సి ఉంటుంది. సెక్యూరిటీ, శానిటేషన్‌ సిబ్బంది ప్రత్యేక నియామకాలు చేపట్టకపోతే భవన నిర్వహణ దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ భవనంలో అలాంటి ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం వల్లే నిర్వహణ సామర్థ్యం సక్రమంగా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జింకానా వారు కొన్నేళ్లపాటు భవన నిర్వహణ పనులకు ముందుకు వచ్చారు. వారికి తోడ్పాటుగా ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ చేపట్టి ప్రత్యేక వైద్య సిబ్బంది, వైద్యులను నియమించాల్సి ఉంది. గతంలో గైనిక్‌, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో 100 నుంచి 200 వరకు మాత్రమే పడకలు ఉండేవి. నూతన ఎంసీహెచ్‌ భవనంలో 600 పడకలు వచ్చాయి. అదనంగా వచ్చిన పడకల్లో వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వం తక్షణమే రిక్రూట్‌మెంట్‌ చేపట్టాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement