ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం | - | Sakshi
Sakshi News home page

ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

● సర్కార్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతల నినాదాలు ● మేనిఫెస్టో ప్రతుల దహనాన్ని కూడా అడ్డుకున్న పోలీసులు ● ఖాకీల తీరుపై అంబటి, అప్పిరెడ్డి ఆగ్రహం

లక్ష్మీపురం: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం రెండో రోజు గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డులో నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలసి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యలు హాజరయ్యారు. ముందుగా పానుగంటి చైతన్య తదితరులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా నిరసన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా అక్కడకు వచ్చారు. రుషి వ్యాలీ అపార్ట్‌మెంట్‌ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తిరిగి శ్రీనివాసరావు పేట 60 అడుగుల రోడ్డు వద్దకు ర్యాలీ చేరుకుంది. అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిలు మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యకర్తలను పంపించేందుకు పోలీసులు హడావిడి చేశారు. అయినప్పటికీ లెక్కచేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్‌ బక్కెట్‌తో నీటిని తీసుకొచ్చి దహనం అవుతున్న కరపత్రాలపై పోశాడు. పార్టీ నేతలు కలపాల సత్యన్నారాయణ, పల్లపు వెంకటేష్‌, ఖాజామొహీయుద్దీన్‌, కాండ్రుగుంట గురవయ్య, గేదెల రమేష్‌, యాపర్తి కోటి, షేక్‌ రోషన్‌, ఆచారి, పల్లపు మహేష్‌, యూనుస్‌ పాషా, తోట వెంకటేష్‌, వెంకాయమ్మ, శివపార్వతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారీగా పోలీసుల కాపలా

నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నగరంపాలెం పోలీసులతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు, ట్రాఫిక్‌ సీఐ, నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఎస్సైలు, వెస్ట్‌ ఇన్‌చార్జి డీఎస్పీ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీలతో భారీ సంఖ్యలో మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement