మేడికొండూరు: ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేశారు. మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వలన కాలుష్య కోరల నుంచి బయటపడవచ్చని, ఎండ వేడిమి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ మాట్లాడుతూ సీడ్ బాల్స్‌తో మొక్కలు పెరుగుటకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం మాట్లాడుతూ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించుటకు లక్ష మొక్కలు నాటాలని తెలిపారు. మిషన్ కూల్ గుంటూరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, సి.ఎస్.ఆర్. ఆర్గానిక్స్ నిర్వాహకులు మొక్కల సీతారామయ్య, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ


