‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం
తెనాలి: పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవంలో భాగంగా ఈనెల 6వ తేదీన తెనాలిలో శాసీ్త్రయ సంగీత సభ నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 6.15 గంటలకు బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం–2026ను ప్రముఖ విద్వాంసులు డీవీకే వాసుదేవన్, డి.ఫణికుమార్(దేవన్‌ద్రోణ్)కు ప్రదానం చేయనున్నారు.
వినూత్న వాద్య ద్వయం...
తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక సంగీతం, ఫ్యూషన్ సంగీతం, సంగీత విద్యలో రెండున్నర దశాబ్దాలుగా విశిష్ట సేవలను అందిస్తున్న వయోలిన్, వేణువు ద్వయం ‘దేవన్ ద్రోణ్’. విజయవాడకు చెందిన డాక్టర్ వయోలిన్ వాసుదేవన్, మచిలీపట్నం ఫ్లూట్ విద్వాంసుడు ద్రోణేంద్ర ఫణికుమార్ ఈ ప్రత్యేక సంగీత ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ‘నాదసుధానిధి’ డాక్టర్ అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను అభ్యసించిన వీరు, సంగీత చరిత్రలో తొలిసారిగా వయోలిన్–ఫ్లూట్ ద్వయాన్ని సంగీతాభిమానులను రంజింపజేసే స్థాయికి తీసుకొచ్చారు.
డాక్టర్ వాసుదేవన్ ఐఐటీ విజిటింగ్ ఫ్యాకల్టీగానూ..
డాక్టర్ వాసుదేవన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వయోలిన్ విద్వాంసుడు, పరిశోధకుడు, విద్యావేత్త, సంగీతంలో పీహెచ్‌డీతోపాటు భారతీయ సంగీతం, సమాచార సాంకేతికతలో ఉన్నతవిద్యను అభ్యసించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సంగీత అధ్యాపకునిగా సేవలందించారు. ప్రస్తుతం ఐఐటీ, ఐఐఐటీ వంటి విద్యాసంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు. సంగీత విద్య, పరిశోధన, సంస్కృతి పరిరక్షణ రంగాల్లో విశేష సేవలను అందిస్తూ, పలు పుస్తకాలను రచించారు. సంస్కృతి ఫౌండేషన్‌తో వేలాదిమందికి సంగీత శిక్షణ, సాంస్కృతిక అవగాహనను నిర్వహిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫణికుమార్
‘ఫ్లూట్ ఫణి’గా గుర్తింపు పొందిన ద్రోణేంద్ర ఫణికుమార్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. సంగీతాన్ని జీవన సాధనంగా స్వీకరించారు. బాల్యం నుండే సంగీతాభ్యాసం ప్రారంభించి, పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చారు. ‘ఘంటసాల పురస్కారం’, ‘బెస్ట్ యంగ్ టాలెంటెడ్ మ్యూజీషియన్’ గౌరవాలను అందుకున్నారు. ‘లెర్న్ ఫ్లూట్ బై యువర్‌సెల్ఫ్’ అనే శిక్షణ కార్యక్రమం, ‘నాదయోగ’ ఆల్బమ్‌తో సంగీతాన్ని విద్య, ధ్యానం, వ్యక్తిత్వ వికాసంతో అనుసంధానించారు. ‘సిరాజ్’ సంస్థతో కర్ణాటక సంగీత ప్రచారానికి కృషిచేశారు. ఈ ఇద్దరు సంగీత విద్వాంసులు కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీత అంశాలను సమన్వయపరుస్తూ వయొలిన్, ఫ్లూట్, కీబోర్డు, ఘటం వంటి వాద్యాలతో వినూత్న సంగీతానుభూతిని అందిస్తున్నారు. పండితులతో సహా సాధారణ ప్రజల ఆదరణ పొందుతున్నారు. శాసీ్త్రయ సంగీతానికి భంగం కలగకుండా ఆధునిక శైలిలో ప్రజలకు చేరువవుతున్నాయి వీరి ప్రదర్శనలు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఫ్రాన్స్, యూరప్ దేశాల్లోనూ అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్, నమస్తే ఫ్రాన్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గోవా, తెలుగు కల్చరల్ ఫెస్టివల్స్, లివింగ్ హెరిటేజ్ ఫెస్టివల్, నాదనీరాజనం వంటి ప్రముఖ వేదికలపై తెలుగు సంగీత వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రశాంతి నిలయం, కంచి మఠం, శివానంద ఆశ్రమం వంటి ఆధ్యాత్మిక వేదికల్లోనూ వీరి సంగీతం విశేష ఆదరణ పొందింది. స్వయంకృషితో ఎదిగి ‘దేవన్ ద్రోణ్’ పేరుతో తెలుగు సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సంగీత ద్వయం, తెలుగు సంస్కృతి, సంగీత వైభవాన్ని ప్రపంచ వేదికలపై చాటుతున్న ఈ కళాకారులు స్ఫూర్తిప్రదాతలు. తొలిసారిగా వీరు తమ వినూత్న వాద్య కచేరీని తెనాలి ప్రేక్షకులకు పరిచయం చేయనుండటం విశేషం! సభానంతరం ఏడు గంటలకు వినూత్న వాయిద్య ద్వయం డి.ఫణికుమార్ వేణువుపై, డి.వాసుదేవన్ వయోలిన్‌పై సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ నాదస్వర విద్వాంసులు, పద్మశ్రీ అవార్డుగ్రహీత డాక్టర్ అన్నవరపు రామస్వామి, శ్రీవివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు పాల్గొంటారు. అనంతరం సంగీత సభను నిర్వహిస్తారు. మృదంగంపై కె.అరవింద్, ఘటంపై ఎం.హరిబాబు వాయిద్య సహకారం అందిస్తారు.
డీవీకే వాసుదేవన్
డి.ఫణికుమార్


