ఎన్జీరంగా వర్శిటీలో ఖేత్‌ బచావో అభియాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్జీరంగా వర్శిటీలో ఖేత్‌ బచావో అభియాన్‌

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

ఎన్జీరంగా వర్శిటీలో ఖేత్‌ బచావో అభియాన్‌ రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి ● యార్డు చైర్మన్‌ కుర్రా అప్పారావు ● 2026 మార్చి వరకు ఆదాయ, వ్యయాలకు కమిటీ ఆమోదం

గుంటూరురూరల్‌: సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం పరిరక్షించబడటమే కాకుండా పంటల నాణ్యత, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతుందని విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి.రామచంద్రరావు అన్నారు. నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం విశ్వవిద్యాలయం, వ్యవసాయ సాంకేతికత అనువర్తన పరిశోధనా సంస్థ(అటారీ) జోన్‌–పది సంయుక్తంగా ఖేత్‌ బచావో అభియాన్‌(పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం) నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్య కార్డుల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్‌ వి.సుమతి మాట్లాడుతూ విచక్షణ రహితంగా రసాయనాలు వాడటం వలన ఐదు నిముషాలలో దీనిని నాశనం చేస్తున్నామని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడకోవాలని సూచించారు. లాం పరిశోధన స్థానం మృత్తికాశాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజ విన్నకోట, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము పంటలు తొలకరిలో వేసుకొని భూమిలో కలియ దున్నడం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్‌ శాతం పెరిగి, నేల నీటి నిల్వ సామర్థ్యం సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారు. రసాయన ఎరువుల అవసరం కొంత మేర తగ్గి, సాగు వ్యయాలు కూడా నియంత్రణలో ఉంటాయని తెలిపారు. యడ్లపాడుకు చెందిన ప్రగతిశీల రైతు శివరామకృష్ణ మాట్లాడుతూ ఎరువుల వాడకంలో సమన్వయం పాటించి సమతుల్యతను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో అటారీ జోన్‌–పది శాస్త్రవేత్తలు డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ భాస్కరన్‌, ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌.వి.వి.ఎస్‌.దుర్గాప్రసాద్‌, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, ప్రగతి శీల రైతులు పాల్గొన్నారు.

కొరిటెపాడు(గుంటూరు):మిర్చి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కుర్రా అప్పారావు స్పష్టం చేశారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో చైర్మన్‌ అప్పారావు అధ్యక్షతన శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మిర్చి యార్డుకు సంబంధించి 2026 మార్చి వరకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను ఆమోదించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి యార్డుకు వచ్చే మిర్చి రైతులకు మెరుగైన వసతులు, రైతు విశ్రాంతి భవనంలో రైతు ఉపయోగార్థం గ్రంథాలయం ఏర్పాటు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, గుంటూరు కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(జీడీసీఎంఎస్‌) చైర్మన్‌ వడ్రాణం హరిబాబు, వైస్‌ చైర్మన్‌ బి.మల్లిక, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement