వెన్నుపోటుపై నిరసన వెల్లువ ● గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల సెంటర్, చుట్టుగుంట సెంటర్‌లలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం చేసి నిరసన తెలిపారు. గుజ్జనగుండ్ల సెంటర్‌లో నిరసనకు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు టీడీపీ నాయకులు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ప్రదర్శనగా వచ్చారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు ఎదురెదురు పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుల ర్యాలీని పోలీసులు దారి మళ్లించారు. వారు గుజ్జనగుండ్ల సెంటర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడే ఉన్న పటాభిపురం సీఐ సహా పోలీసులు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అనంతరం అంబటి రాంబాబు గుజ్జనగుండ్ల సెంటర్‌లో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ... గతంలో తనపై దాడి చేసిన వారే నేడు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకోకుండా వారికి సహకరించడం దారుణమన్నారు. దాడి చేసినా కేసులు లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చుట్టుగుంట సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు మేనిఫెస్టో ప్రతులు దహనం చేసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
● చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని హిమనీ సెంటర్లో కార్యక్రమం ఏర్పాటైంది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న పార్టీ నాయకులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఆందోళన చేపడుతున్న నాయకులను పోలీసులు త్వరగా ఆందోళన ముగించాలంటూ హడావుడి చేశారు. డీఎస్పీ అబ్దుల్ అజీజ్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి, పాత గుంటూరు సీఐ వెంకటప్రసాద్, సిబ్బందితో హడావుడి సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలు సైతం వారి చర్యలను తీవ్రంగా ప్రతిఘటించారు.
● తెనాలి నియోజకవర్గంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. రూరల్ మండల గ్రామం కొలకలూరులో, మండల కేంద్రం కొల్లిపరలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రెండుచోట్ల నిరసన ప్రదర్శన చేసి, మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోను దహనం చేశారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం పేరేచర్లలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండేళ్ల పాలనను ఎండగడుతూ నినాదాలు చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. పేరేచర్ల సెంటర్‌లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వనమా బాలవజ్రబాబు, నాయకులకు వాగ్వాదం జరిగింది. పోలీసులను లెక్కచేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీని కొనసాగించారు. ర్యాలీ ప్రశాంతంగా జరిగింది. తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురంలో కూడా మండల నాయకుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
● మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలంలో నిరసన కార్యక్రమం జరిగింది. మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాక కార్యక్రమం ప్రారంభించారు. చంద్రబాబు రెండేళ్ల పాలన తీరును దుయ్యబట్టారు. టీడీపీ పాలనతో నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి పేద ప్రజలపై ఆర్థిక భారం పడిందని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపేవారిపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు గురిచేయడం నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, వారిపై దాడులకు తెగబడడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. కార్యకర్తలు, నాయకులు నిరసనలో పాల్గొన్నారు.
● ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు రూరల్ మండలంలో నిరసన కార్యక్రమం జరిగింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పన్నులు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు చల్లా హనుమంతుయాదవ్, పెదనందిపాడు మండల అధ్యక్షుడు షేక్ ఖాసీం పీరా, వట్టిచెరుకూరు మండల కన్వీనర్ మన్నవ వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ప్రత్తిపాడు సెంటర్‌లో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాకుమాను మండల అధ్యక్షుడు కె. రవి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రశాంతంగా జరిగింది.
● పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలంలో జెడ్పీటీసీ గోళ్ల జ్యోతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెచ్చగొట్టేందుకు
టీడీపీ యత్నం
టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం అడ్డుకునేందుకు పోలీసుల యత్నం తెలుగుదేశం నేతల పోటీ ప్రదర్శన వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహనం దగ్గరుండి సహకరించిన పట్టాభిపురం సీఐ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుపై గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తింది. ప్రజల్ని మోసం చేసిన టీడీపీ మేనిఫెస్టో కాపీలను పలుచోట్ల దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల ప్రయత్నం చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్‌లో చేసిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అండగా నిలబడటమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే పట్టాభిపురం సీఐ అక్కడే ఉండి చోద్యం చూడటం విమర్శలకు తావిచ్చింది.
నియోజకవర్గాల వారీగా ఇలా...
అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను డస్ట్‌బిన్‌లో వేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన తెలిపేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలను టీడీపీ మూకలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం దుర్మార్గమని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు తగులబెట్టాలని టీడీపీ నేతలకు చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలే అధికారంలో నుంచి పీకిపారేస్తారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అన్ని వర్గాలను మోసగించిన చంద్రబాబు... ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దిష్టిబొమ్మను పోలీసులు దగ్గరుండి దహనం చేయించారని మండిపడ్డారు.