భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ ఆదేశాలు

లక్ష్మీపురం: రాజధానిలో భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం సి.ఆర్‌.డి.ఎ. అడిషనల్‌ కమీషనర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌తో కలసి రాజధాని భూసేకరణ గురించి జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ – 3, ఈ – 13, ఈ –15 పరిధిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, స్టీల్‌ బ్రిడ్జి, ఎన్‌హెచ్‌ 16ను కలిపేలా ట్రంకు రోడ్డు తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్‌ అంశాల గురించి చర్చించారు. ఇరిగేషన్‌, రైల్వే తదితర శాఖలకు సంబంధించిన భూముల విషయంలో పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి పెండింగ్‌ లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లంక భూములకు సంబంధించి ఏకీకృత నివేదికలు తయారు చేయాలన్నారు. గ్రామ కంఠాలు, మ్యూటేషన్స్‌ విషయంలో ఆర్డీవోలు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి సకాలంలో పనులు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు, సీఆర్‌డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రాక్టికల్‌గా కెరీర్‌ కౌన్సెలింగ్‌

ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు కెరీర్‌ కౌన్సిలింగ్‌ ప్రాక్టికల్‌గా ఇద్దామని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కెరీర్‌ కౌన్సెలింగ్‌కు ఆయా కంపెనీలు, వ్యక్తుల వద్దకు పంపాలని సూచించారు. జిల్లా విద్యా శాఖ అధికారి సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న 32 వసతి గృహాలు ఆహ్లాదకరంగా ఉండాలని సూచించారు. ఆరు నెలలలో నవీకరణ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా బీసీ అధికారి కె.మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి. దుర్గాబాయి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్‌ సలీం బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement