పట్నంబజారు: మహిళ మృతిపై రీపోస్టుమార్టం నిర్వహించాలని ఫిర్యాదు ఘటనపై కేసు నమోదైంది. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండకు చెందిన షేక్ సుమయ (44) మహిళను 20 ఏళ్ల క్రితం మొహమ్మద్ షౌకత్‌అలీ వివాహం చేశారు. కొద్దిరోజులపాటు ఆయాప్రాంతాల్లో నివాసం ఉన్న దంపతులు, వివాదాల నేపథ్యంలో వేర్వేరుగా సుమయ అరుంధతీనగర్‌లో నివాసం ఉండగా, ఆనందపేటలో షౌకత్ అలీ నివాసం ఉంటున్నాడు. గతనెల 30న రాజీ నిమిత్తం ఆనందపేటకు రావాలని పిలిపించారు. 31న సింగరాయకొండలో ఉన్న మృతురాలి సుమయ సోదరుడు షేక్ షఫీకి ఫోన్ చేసి మీ సోదరి హార్పిక్ తాగి చనిపోయిందని ఖననం చేశారు. తన సోదరి మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని షేక్ షఫీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను చంపి పాతిపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రీపోస్టుమార్టం చేయాలని పోలీసులతోపాటు, తహసీల్దారుకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రీపోస్టుమార్టం చేసేందుకు సన్నద్ధమయ్యారు.
చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి
నగరంపాలెం/ఫిరంగిపురం: ఫిరంగిపురం పోలీస్‌స్టేషనన్‌లో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న కె.భూషణం (55) మృతిచెందారు. బుధవారం రాత్రి విధుల్లో కె.భూషణం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్తించిన సహచర సిబ్బంది చికిత్స నిమిత్తం తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్సకై గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. భూషణంకు భార్య, పిల్లలు ఉన్నారు. భూషణం అంత్యక్రియలు యర్రగుంట్లపాడు గ్రామంలో ప్రభుత్వలాంఛనాలతో నిర్వహించారు. సీఐ భుజంగరావు, స్టేషన్ సిబ్బంది, గుంటూరు నుంచి వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్స్ భూషణం మృతదేహం వద్ద గాలిలోకి కాల్పులు జరిపి పోలీసు లాంఛనాలతో నివాళులర్పించారు. గతంలో ఆయన పక్షవాతంతో బాధపడ్డాడని, అయినా నిబద్ధతతో విధులు నిర్వర్తించాడని సహచర సిబ్బంది గుర్తుచేసుకున్నారు. భూషణం కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు.


