లీలా మహేశ్వరి ధన్యజీవి | - | Sakshi
Sakshi News home page

లీలా మహేశ్వరి ధన్యజీవి

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌ అంతరించిపోతున్న విలువలకు ప్రతిరూపంగా నిలిచిన వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించిన వావిలాల కుమారి లీలామహేశ్వరి ధన్యజీవి అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వావిలాల లీలామహేశ్వరి 88వ జయంతి సందర్భంగా గురువారం అరండల్‌పేటలోని వావిలాల సంస్థ ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు, వావిలాల సంస్థ కార్యదర్శి మన్నవ సోడేకర్‌ అధ్యక్షత వహించిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్యకు వెన్నంటి ఉంటూ వారు తుది శ్వాస విడిచే వరకూ సేవలు అందించిన మహనీయురాలు లీలామహేశ్వరి అని తెలిపారు. వావిలాల గోపాలకృష్ణయ్య 1952 నుంచి 1972 వరకు నాలుగు సార్లు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అద్వితీయమైన కృషి చేశారని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభించిన సారా వ్యతిరేక ఉద్యమం విజయవంతమై సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చిందని, పొదుపు ఉద్యమం ప్రారంభమై మహిళలు సంఘటితమయ్యారని అన్నారు. వావిలాల లీలామహేశ్వరి వివాహం చేసుకోకుండా తోబొట్టువులుగా ఉన్న 12 మందిని చదివించి వృద్దిలోకి తీసుకురావడంతో పాటు వావిలాల గోపాలకష్ణయ్య అనారోగ్యం పాలైన రోజుల్లో సెతం కన్నబిడ్డగా సేవలను అందించారన్నారు. అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ వావిలాల లీలా మహేశ్వరి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వేలాది మంది విద్యార్థులను అభివృద్ధి పదంవైపు నడిపారని, 40 ఏళ్లపాటు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థలో పనిచేసి వేలాది మంది విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తిని ప్రేరేపించారని తెలిపారు. వావిలాల సంస్థ పూర్వ చైర్మన్‌ డాక్టర్‌ ఎండీవీ రమణారావు మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య ఆలోచన ధోరణితోనే లీలా మహేశ్వరి కొనసాగినారన్నారు. దేశభక్తి, మద్యనిషేధం, తెలుగు భాష, సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలకు వావిలాల ఇల్లు చిరునామాగా మారిందన్నారు. మహిళా విద్య కోసం 70 ఏళ్ల క్రితమే వావిలాల కుటుంబం కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మాజేటి సోమశేఖర్‌, పూర్వ ప్రిన్సిపాల్‌ వి. సుబ్బారాయుడు, వావిలాల కుటుంబ సభ్యులు వావిలాల రమ, సత్యం, భారతి, భారతీ చంద్ర, బీజేపీ నేత ఆర్‌. లక్ష్మీపతి, రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ భువనగిరి కృష్ణవేణి, వావిలాల గ్రంథాలయ శాస్త్ర పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ధోనె రాంబాబు, బీహెచ్‌ హైస్కూల్‌ పూర్వ హెచ్‌ఎం మనోరమ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అంబటి రాంబాబు

Advertisement
 
Advertisement
Advertisement