గుంటూరు మెడికల్: ‘ఇక్కడ నేనే బాస్.. నేను చెప్పిందే వేదం.. అలా నడుచుకోకపోతే పనిష్‌మెంట్ తప్పదంటూ’ గుంటూరు జీజీహెచ్‌లో ఓ లేడీ బాస్ చేస్తున్న ఓవర్ యాక్షన్‌కు మనస్తాపం చెందిన నర్సింగ్ సిబ్బంది గురువారం విధులకు సెలవు పెట్టారు. దీంతో అత్యవసర సేవల కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ పంచాయితీ చివరికి సూపరింటెండెంట్ వద్దకు చేరడంతో శాంతించిన నర్సింగ్ సిబ్బంది విధుల్లో చేరారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ అత్యవసర విభాగంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ బుధవారం నర్సింగ్ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. తాను చెప్పిన చోట కూర్చోవాలని, ఎప్పటి నుంచో నర్సింగ్ సిబ్బంది ఉంటున్న ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. సదరు డాక్టర్ తీరుపై మనస్తాపం చెందిన నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంఓ దృష్టికి సమస్య తీసుకెళ్లారు. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో గురువారం నర్సింగ్ సిబ్బంది విధులు నిలిపివేసి, సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ సీనియర్ లేడీ డాక్టర్ గతంలో ఇదే తరహాలో పీజీ వైద్యులతో, క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్‌లతో గొడవ పెట్టుకోవడంతో వారు ఆమె తీరుపై విసుగు చెంది ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు ఉన్న ఇన్‌చార్జి బాధ్యతలు తొలగించి, ఇతర వైద్యులకు అప్పగించారు. ఇన్‌చార్జిగా ఉన్నవారిపై సైతం ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఆమైపె చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెకున్న రాజకీయ పలుకుబడికి ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగానే రెండు రోజులుగా నర్సింగ్ సిబ్బంది ఆమె బారిన పడి ఇబ్బందులు పడుతూ వైద్య సేవలు నిలిపివేసే పరిస్థితి నెలకొంది. జీజీహెచ్‌కు గుండెలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్‌లో అందరిని కలుపుకొనిపోవాల్సిన సీనియర్ లేడీ బాస్ అందరితో వివాదాలకు దిగడం, తాను పనిచేయకుండా, మిగితావారిని కూడా విసిగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం వివాదాలకు నిలయంగా మారింది. వైద్య సేవల్లో జాప్యానికి కారణమవుతున్న లేడీబాస్‌పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.


