లలిత పీవీఎస్ హాస్పటల్ నిర్వాహకులు డాక్టర్ రాఘవశర్మ
గుంటూరు మెడికల్: పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకు రావాలనే లక్ష్యంతో గుంటూరు తక్కెళ్లపాడులోని లతితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పటల్‌ను ఏర్పాటు చేశామని చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవశర్మ చెప్పారు. గురువారం హాస్పటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా లలితా గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో లక్షలాది మందికి వైద్య సేవలు అందించామన్నారు. ఆవైద్య సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతోనే లలితానగర్‌లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో అన్ని రకాల వైద్య సేవలతో, ఆహ్లాదకరమైన పరిసరాలతో నూతన ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ, త్రీడీ టెక్నాలజీ ఎమ్మారై స్కానింగ్ మెషిన్‌ను ఏర్పాటు చేశామన్నారు. హాస్పటల్ సీఈఓ, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోలవరపు అనురాగ్ మాట్లాడుతూ గుండె జబ్బు రోగుల కోసం మూడు అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌లు, పది మంది కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్నారన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, న్యూరాలజిస్ట్, డాక్టర్ నరేన్ పోలవరపు మాట్లాడుతూ ఏపీలోనే తొలిసారిగా 1990 నుంచి న్యూరాలజీ, కార్డియాలజీ వైద్యసేవలు తాము గుంటూరు కొత్తపేటలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తమ అడ్వాన్స్‌డ్ అంకినీడు స్ట్రోక్ సెంటర్‌లో ఏఐ ఆధారిత స్ట్రోక్ సేవలు అందిస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ క్యాన్సర్ జబ్బులకు సమగ్ర వైద్య సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతినెలా రెండో గురువారం పురుషులకు, మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని, వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ సిరిచందన గంగసాని మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అత్యాధునిక వైద్యం, విద్య పరిశోధన, సమాజ సేవ అనే నాలుగు అంశాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.


