చిన్నారికి అరుదైన గుండెశస్త్ర చికిత్స | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి అరుదైన గుండెశస్త్ర చికిత్స

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని మెడ్‌స్టార్‌ హాస్పిటల్‌లో యూరప్‌ చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుండె శస్త్ర చికిత్స వైద్యనిపుణులు డాక్టర్‌ పి.వి. నరేష్‌కుమార్‌, డాక్టర్‌ చైతన్యలు మాట్లాడుతూ యూరప్‌లోని జార్జియా దేశానికి చెందిన చిన్నారి పుట్టుకతోనే పల్మనరీ అట్రేసియా అనే క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధితో బాధపడుతోందని పేర్కొన్నారు. ఈ సమస్య కారణంగా చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో ప్రాణాపాయస్థితి ఎదురైందని తెలిపారు. స్వదేశంలో వైద్యం చేయించినప్పటికీ ఆశించిన ఫలితం లభించలేదని వివరించారు. గతంలో అక్కడ బ్లేలాక్‌ టాసిగ్‌ (బిటి) షంట్‌ చికిత్స నిర్వహించారని తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ ద్వారా తాడేపల్లిలోని మెడ్‌స్టార్‌ ఆసుపత్రిని సంప్రదించారని, ఇక్కడి వైద్యుల సూచన మేరకు చిన్నారిని యూరప్‌ నుంచి గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని మెడ్‌స్టార్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. రోగి పరిస్థితిని పరిశీలించిన మెడ్‌స్టార్‌ యాజమాన్యం ప్రత్యేక బహుళ విభాగాల నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఆ చిన్నారికి సరిపోయేలా ఒక ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళికను రూపొందించి ఆపరేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంటోందని, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు గణనీయంగా పెరగడంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. కార్డియోథొరాసిక్‌ సర్జరీ నిపుణులు డాక్టర్‌ పి.వి.నరేష్‌కుమార్‌, డాక్టర్‌ చైతన్య నేతృత్వంలో జరిగిన ఈ అరుదైన శస్త్ర చికిత్సలో చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ బి.విజయ చైతన్య, సీనియర్‌ కార్డియాలిజిస్ట్‌ డాక్టర్‌ బి.శ్రీహరి, ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ సాయితేజ, కార్డియాక్‌ అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ రామ్‌మోహన్‌లతో పాటు కార్డియోథొరాసిక్‌ సర్జన్లు, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది కీలక ప్రాత పోషించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement