గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు పేర్కొన్నారు. బుధవారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బసవ లింగారావు మాట్లాడుతూ... పాఠశాల విద్యారంగం అనేక ఆటుపోట్లకు గురవుతూ సంక్షోభంలో ఉందన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ప్రైవేటు వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించి మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి. నాగశివన్నారాయణ, పుట్టా జనార్దనరావు, పి.లక్ష్మీనారాయణ, జి.శివరామ కృష్ణ, పచ్చల శివరామకృష్ణ, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.వెంకటేశ్వరావు, ఆడిట్ కమిటీ సభ్యులు షేక్ సిద్దిక్, కె.ఆదినారాయణ పాల్గొన్నారు.


