అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏఐ ఆధారిత పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏఐ ఆధారిత పరీక్షలు

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

మహిళా శిశు సంక్షేమ శాఖ ఒంగోలు జోనల్‌ రీజినల్‌ జేడీ బి.మనోరంజని

లక్ష్మీపురం: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 0 – 6 ఏళ్ల పిల్లల కోసం ఏఐ ఆధారిత శిశు వికాస పరీక్షల కోసం శిక్షణ కార్యక్రమం స్థానిక కృషి భవన్‌లో బుధవారం నిర్వహించారు. చిన్నారుల్లో వికాస లోపాలను ముందుగానే గుర్తించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు జోనల్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మనోరంజని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మిషన్‌ పోషణ్‌ 2.0 లో భాగంగా, ఏఐ ఆధారిత శిశు వికాస పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌ ద్వారా పిల్లల మాట, చూపు, స్పందన, కదలికలను రికార్డ్‌ చేసి, స్క్రీనింగ్‌ చేస్తారని తెలిపారు. లవ్‌, టాక్‌, ప్లే (ప్రేమ, మాట, ఆట) ముఖ్య లక్ష్యంతో 0–3 ఏళ్ల వయసులోనే గుర్తిస్తే 80 శాతం కేసులు పూర్తిగా నయం చేయవచ్చన్నారు. అంగన్‌వాడీలు ఇకపై కేవలం పోషకాహార కేంద్రాలు మాత్రమే కాకుండా ఏఐ సహాయంతో ప్రతి బిడ్డ మెదడు వికాసాన్ని కాపాడే ‘నవచేతన’ నిలయాలు చేయడమే లక్ష్యం అన్నారు. ఈ ట్రైనింగ్‌ తర్వాత జిల్లాలోని 1480 అంగన్‌వాడీ కార్యకర్తలకు సూపర్‌వైజర్లు, మెడికల్‌ ఆఫీసర్లకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి, సాధికారత అధికారి పి.పి.జి.ప్రసూన మాట్లాడుతూ జిల్లా స్థాయి శిక్షణను ఉపయోగించుకొని, జిల్లాలోని బాలలందరూ ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలని తెలిపారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ కీర్తి జిల్లాలో టీఓటీలుగా వ్యవహరించిన విజయ్‌ గౌరి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అంగన్వాడీ సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, మెడికల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement