తాడికొండ: విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించడంలో వీఐటీ– ఏపీ వర్సిటీ కృషి అభినందనీయమని ఏపీ యువజన సేవలు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. వీఐటీ– ఏపీలో బుధవారం 3వ రోజు కొనసాగుతున్న చెస్ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెస్ ఆడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వీఐటీ– ఏపీ వీసీ డాక్టర్ పి.అరుళ్మోళి వర్మన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడా రంగంలోను ప్రతిభను పెంపొందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందులో భాగంగానే అతిపెద్ద అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డీడీ డాక్టర్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు.


