మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అత్యధికులు కౌలు రైతులే
పెదకాకాని: భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే ప్రధానంగా జీవిస్తున్నారని, అలాంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు చిన్న చూపుచూస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. పెదకాకానిలో గురువారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం గుంటూరు జిల్లా నాలుగవ మహాసభ నిర్వహించారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్ల రామకృష్ణ జెండాను ఆవిష్కరించారు. సభకు అధ్యక్షవర్గంగా బి రామకృష్ణ, కందుల శ్రీనివాసరావు వ్యవహరించారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు కార్యవర్గ నివేదిక ప్రవేశపెట్టారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు ప్రాధాన్యతను గుర్తించడం లేదని వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, రుణాలు నానాటికీ తగ్గిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధిక భాగం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారన్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే అధిక వర్షాలు, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప పనులు ఎక్కడ జరగట్లేదన్నారు. పల్నాడులో నాగార్జునసాగర్ పక్కనే ఉంచుకొని రైతులు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో కౌలు రైతులది కీలకపాత్ర అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటల రుణాలు మంజూరు చేయాలని, అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు వర్తింపజేయాలన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కందుల శ్రీనివాసరావు, బొట్ల రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గాదె రామారావు, పాశం రామారావు సహాయ కార్యదర్శులుగా మన్నవ నాగమల్లేశ్వరరావు, సంకూరి, నీలాంబరం, కోశాధికారిగా రాజేంద్ర మరో పది మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభల్లో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి లక్ష్మణరావు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ ప్రసంగించారు. అధిక సంఖ్యలో రైతులు రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.


