పోటీల్లో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా
తాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె. లక్ష్మీశాను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్‌కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


