5న పెదకాకాని ఎంపీపీ ఎన్నిక
పెదకాకాని: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక జనవరి 5వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంఎల్ నరసింహారావు బుధవారం తెలిపారు. పెదకాకాని మండలంలో మొత్తం 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా .. వారిలో 15 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు విజయం సాధించారు. ఆరుగురు టీడీపీ సభ్యులు గెలుపొందారు. అప్పట్లో ఎంపీపీగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎంపీపీ ఎన్నిక జరిగి నాలుగేళ్లు పూర్తి అయింది. వైఎస్సార్ సీపీకి చెందిన 9 మందిని టీడీపీ నాయకులు చేర్చుకుని నవంబరు 10వ తేదీన అవిశ్వాస తీర్మానం ద్వారా ఎంపీపీని పదవి నుంచి తప్పించారు.
గుంటూరు మెడికల్: జిల్లాలో పనిచేస్తున్న 108 అంబులెన్సు సిబ్బంది జనవరి 12వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ డిమాండ్‌లతో కూడిన సమ్మె నోటీసును గుంటూరు జిల్లా వైద్య అధికారులకు అందజేశారు. 5న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసన, 7న ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మెయిల్స్ పంపడం, 10న విజయవాడలో రిలే నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం, 108 నిర్వహణ బాధ్యతలు చూస్తున్న భవ్య మెడికల్ సర్వీసెస్ కంపెనీ స్పందించని పక్షంలో 12 నుంచి విధులు బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.
గుంటూరు లీగల్: జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమన్వయంతో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు లేని సమాజం నిర్మించడానికి వంద రోజుల అవగాహన సదస్సులో భాగంగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ‘ఆషా’ అనే కొత్త కార్యాచరణను రూపొందించిందని తెలిపారు. 18 ఏళ్లలోపు వారికి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందన్నారు. ఆషా యూనిట్ కొత్త నిబంధలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి సి.హెచ్. విజయ్ కుమార్, డెప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణ, ప్యానెల్ అడ్వకేట్ కట్ట కాళిదాసు, మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ పాల్గొన్నారు.


