మహిళా సాధికారత సాధ్యం
లింగ సమానత్వం ద్వారానే
డీఆర్‌ఓ ఖాజావలి
గుంటూరు వెస్ట్ : లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులు అరికట్టడానికి, లింగ వివక్ష నిర్మూలనపై అవగాహన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 23వ తేదీ వరకు జిల్లా, మండల , గ్రామ స్థాయిలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సులు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలపై వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి సీ్త్ర, పురుషులు సమానమని తెలియజేయాలన్నారు.


