పెదకాకాని నవశక్తి క్షేత్రంలో చోరీ
50 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు హుండీలు ఎత్తుకెళ్లిన దొంగలు
పెదకాకాని: పెదకాకాని నవశక్తి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి ఆభరణాలతో పాటు మూడు హుండీలను ఎత్తుకెత్తిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రమైన పెదకాకాని శివారులో వెనిగండ్ల నుంచి అగతవరప్పాడు వెళ్లే రోడ్డులో నవశక్తి పీఠం ఉంది. ఈ క్షేత్రంలో నిత్యం పూజా కై ంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆలయ తలుపులకు అర్చకులు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం గుడి వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసిన గడి పగులగొట్టి తలుపులు తీసి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూ టీం బృందంతో పెదకాకాని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆలయంలో అమ్మవారి ఆభరణాలు 12 మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, 2 ముక్కుపుడకలు, ఆలయంలో అమర్చిన మూడు హుండీలు ఎత్తుకెళ్లారు. ఆభరణాలు సుమారు 50 గ్రాముల బరువు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దొంగలు ఎత్తుకెళ్లిన మూడు హుండీలను సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పగులగొట్టి అందులో ఉన్న కానుకలు తీసుకుని ఖాళీ హుండీలను అక్కడే వదిలి వెళ్లారు. పీఠం నిర్వాహకుడు విశ్వనాథుని మోహనరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.


