మహిళల రక్షణకు బలమైన చట్టాలు
గుంటూరు లీగల్: మహిళల రక్షణ కోసం మన చట్టాలు బలంగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మహిళలపై జరిగే శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక, హింసలు, సైబర్ హింసల గురించి వివరించారు. వాటి ద్వారా మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలిపారు. ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 15 (లింగ వివక్ష నిరాకరణ), ఆర్టికల్ 21(జీవించే హక్కు) ద్వారా మహిళల హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. గృహ హింస, మెయింటెనెన్సు వంటి చట్టాల గురించి సమాజంలో, ఇంట్లో, పనిచేసే చోట మహిళలకు జరిగే శారీరక, మానసిక హింసలపై అవగాహన కల్పించారు. మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ మాట్లాడుతూ మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు, మహిళలకు అందే హక్కుల గురించి వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా డిజిటలైజ్డ్ క్రైమ్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉందన్నారు. మహిళలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. హక్కుల దుర్వినియోగం, పని చేసేచోట, ఇంట్లో వేధింపులకు గురి అవ్వడం, మహిళలకు ఉన్న ఇష్టాలు, అభిప్రాయాలను నియంత్రించడం ద్వారా ఎక్కువగా హింసలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలకు జరిగే హింసల నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్


